Amazon Forest Extinction : అంతరించిపోనున్న అమెజాన్ ఫారెస్ట్​

Amazon Forest Extinction : అంతరించిపోనున్న అమెజాన్ ఫారెస్ట్​
మరో పాతికేళ్లలో సగం ఖాళీ

భారతదేశం కంటే దాదాపు రెట్టింపు విస్తీర్ణం కలిగి ఉన్న అమెజాన్‌ అడవులు మనుగడ ప్రమాదంలో పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మంచి నీటి నిల్వలలో దాదాపు 20 శాతం ఒక్క అమెజాన్‌ అడవుల్లోనే ఉన్నాయి. దక్షిణ అమెరికా ఖండంలోని 8 దేశాల్లో విస్తరించి ఉన్న అమెజాన్‌ అడువులు భూతాపాన్ని అరికట్టడంలోప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా సగటు ఉష్ణోగ్రతలు పెరగడం, అడవుల నరికివేత వంటి చర్యల వల్ల అమెజాన్‌ వర్షారణ్యాలు వేగంగా కుదించుకుపోతున్నాయి.

ఇది పర్యావరణానికి పెను విఘాతంగా పరిణమిస్తోంది. 2050 నాటికి దాదాపు 47 శాతం అమెజాన్‌ అడవులు అంతరించే ప్రమాదం ఉన్నట్లు ఓ నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బ్రెజిల్‌లోని ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ శాంటా కాటరినా ఈ నివేదికను తయారు చేసింది. నీటి ఎద్దడి, అడవుల నరికివేత, భూఆక్రమణలు, వాతావరణంలో వస్తున్న మార్పుల ఫలితంగా అమెజాన్‌లో.. దాదాపు సగభాగం క్షీణించే అవకాశం ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. వచ్చే పాతికేళ్లలో అమెజాన్‌ అడవులు 47 శాతం తుడిచి పెట్టుకుపోయే అవకాశం ఉందని నివేదికను రూపొందించిన శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వేడెక్కుతున్న ఉష్ణోగ్రతలు, విపరీతమైన కరవు, అటవీ నిర్మూలన, కార్చిచ్చులు కారణంగా... అమెజాన్‌ ప్రాంతం తీవ్ర ఒత్తిడికి గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెజాన్‌ అడవులపై మరింత అవగాహనను మెరుగుపరచుకోవాలని వాటిని కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.


ప్రపంచ పర్యావరణ వ్యవస్థకు అతి ముఖ్యమైన అమెజాన్‌ అడవుల్లో ఇప్పటికే 15 శాతం నాశనం అయ్యిందని ఈ నివేదిక వెల్లడించింది. కార్చిచ్చు, మానవ తప్పిదాల కారణంగా మరో 17 శాతం అడవి భూభాగం.. ప్రమాదంలో పడిందని తెలిపింది. గత దశాబ్ద కాలంలో సుదీర్ఘమైన కరవుల ఫలితంగా మరో 38 శాతం అడవి బలహీనపడిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మరింత ఉధృతమైతే అమెజాన్ అడవులు ఉష్ణమండల పచ్చిక బయళ్ల ప్రాంతంగా మరిపోతుందని హెచ్చరించింది. వేల సంవత్సరాలుగా అమెజాన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్న పలు స్థానిక తెగల మనుగడకే ముప్పు వాటిల్లుతుందన్నారు. దాదాపు 67 లక్షల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న అమెజాన్‌లో.. దాదాపు 16 వేలకు పైగా వృక్ష జాతులు ఉన్నాయి. ఇప్పుడువేల జాతుల వృక్షాలు, జంతువుల మనుగడే ప్రమాదంలో పడింది. ఈ అడవులను కాపాడానికి...... బఫర్‌ జోన్‌లను ఏర్పాటు చేయాలని నివేదిక సూచించింది.

Tags

Next Story