Amazon jobs: భారత్‌లో 2030 నాటికి 20 లక్షల ఉద్యోగాలు: అమెజాన్

ప్రధాని మోదీ పిలుపు మేరకు భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ ముందుకొచ్చింది. అమెరికాలో మోదీతో భేటీ అనంతరం భారత్‌లో అదనంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని అమెజాన్ తెలిపింది. 2030 నాటికి భారత్‌లో 20 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ ప్రకటించారు. ఇప్పటి వరకు భారత్‌లో 13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు గుర్తు చేశారు. వచ్చే ఏడేళ్లలో భారత్‌లో అదనంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. ఈ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కలిపి భారత్‌లో తాము ఇప్పటివరకూ పెట్టిన మొత్తం పెట్టుబడి 26 బిలియన్ డాలర్లకు చేరిందని అమెజాన్ సీఈవో తెలిపారు. జూన్ 23న వాషింగ్టన్‌లో మోడీతో ఆండీ జాస్సీ సమావేశమై.. భారత్‌లో పెట్టుబడులపై చర్చించారు. భారత్‌లో కోటి చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేయడానికి అమెజాన్ చర్యలు తీసుకుంటుందని ఆండీ జస్సీ తెలిపారు. వచ్చే రెండేండ్లలో భారత్ నుంచి విదేశాలకు 20 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు.. ఇండియాలోని స్టార్టప్‌లు, ఉద్యోగాల కల్పనకు, ఎగుమతులకు ప్రోత్సాహం, డిజిటలైజేషన్, ప్రపంచవ్యాప్తంగా చిన్న వ్యాపారాలు పోటీ పడేలా మద్దతు ఇస్తామని ఆండీ జాస్సీ తెలిపారు. 2030 నాటికి భారత్‌లో 2 మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తామని అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ ఇండియా ఇప్పటికే 62 లక్షల చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేయగా... 7 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులను ప్రారంభించింది. అమెజాన్ బ్లాగ్‌పోస్ట్‌లో భారత్‌లో భవిష్యత్ పెట్టుబడి ప్రణాళికలను ఆండీ జస్సీ బయటపెట్టారు. 2030 నాటికి అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ 12.9 బిలియన్ డాలర్లకు ఈ పెట్టుబడులు అదనం. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్జీ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మోదీతో అమెజాన్ సీఈఓ సమావేశమయ్యారని, భారత్ లో లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడుల గురించి చర్చలు ఫలవంతంగా జరిగాయని చెప్పుకొచ్చారు. భారత్ లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను డిజిటలైజ్ చేయాలనే అమెజాన్ కార్యక్రమాన్ని మోదీ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. మున్ముందు నెలకొల్పబోయే భాగస్వామ్యాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com