America: టీచర్‌ను తుపాకితో కాల్చిన 6 ఏళ్ల బాలుడు
అమెరికా

పాశ్చాత్య దేశాల్లో నానాటీకి పెరుగుతున్న తుపాకీ సంస్కృతి పసి హృదయాలపై విషం చిమ్ముతోంది. అమెరికాలోని వర్జీనియాలో సభ్యసమాజం విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలుడు తన వెంట తెచ్చుకున్న గన్‌తో టీచర్ పై కాల్పులు జరిగిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
ఈ సంఘటన శుక్రవారం న్యూపోర్ట్ టౌన్‌లోని రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలుడు కావాలనే టీచర్ పై కాల్పులు జరిపాడని తెలస్తోంది. ఈ ఘటనను ప్రమాదంగా లెక్కవేయలేమని, ఓ పథకం ప్రకారమే చిన్నారి ఈ దాడికి తెగబడ్డాయని పోలీసులు వెల్లడించారు.
కాల్పుల్లో తీవ్రగాయాలపాలైన ఉపాధ్యాయురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. కాల్పులు జరిపిన చిన్నారి ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడని చెప్పారు. ఆ బాలుడు తుపాకి ఎలా సంపాదించాడో అర్థం కావట్లేదని, అదృష్లావశాత్తు ఘటన జరిగిన సమయంలో పాఠశాలలోని ఇతర చిన్నారులకు ఏ హానీ జరగలేదన్నారు.
ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్ స్పందిస్తూ తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. చిన్నపిల్లలకు తుపాకులు అందుబాటులో లేకుండా చేసేందుకు తల్లితండ్రులు, ప్రజల మద్ధతు కావాలని ఆయన వెల్లడించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com