California Temple : స్వామి నారాయణ్ ఆలయంపై దాడి

కాలిఫోర్నియాలోని స్వామి నారాయణ్ ఆలయంపై జరిగిన దాడిని అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. నేవార్క్‌లోని స్వామినారాయణ్ ఆలయ గోడలు, సైన్ బోర్డులపై ఖలిస్తానీ కార్యకర్తలు భారత్, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలను రాశారు.
అదే సమయంలో ఖలిస్తానీ అనుకూల నినాదాలు రాసినట్లు ఆలయ ప్రతినిధి భార్గవ్ రావల్ నల్లటి ఇంకుతో భారత్ వ్యతిరేక నినాదాలు రాయడం గుర్తించి స్థానిక అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై భారత ఎంబసీ స్పందించింది. ఈ ఘటన భారత సమాజం మనోభావాల్ని దెబ్బతీసిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం డిమాండ్ చేసింది. అలాగే ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు.
వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు భారతదేశం వెలుపల చోటుదక్కకూడదన్నారు. ఘటనపై భారత కాన్సులేట్ అమెరికా ప్రభుత్వానికి, అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు జరుగుతుందని విశ్వసిస్తున్నామన్నారు. అయితే, నేవార్క్ పోలీసులు దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందని తెలిపారు. ఘటనపై బాధను కలిగించిందని, అలాంటి ఘటనలను సహించేది లేదన్నారు. ఘటననను సీరియస్‌గా తీసుకొని జాగ్రత్తగా దర్యాప్తు చేస్తామన్నారు.
అయితే, అమెరికా, కెనడాలోని హిందూ దేవాలయాల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఖలిస్థాన్ మద్దతుదారుల కార్యకలాపాలను తీవ్రతరం చేయడంపై భారత్ ఇంతకుముందు ఆందోళన వ్యక్తం చేసింది. వివిధ దేశాలలో వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలు, వ్యక్తులను అరికట్టింది.
ఆగస్టులో కెనడాలోని సర్రేలోని ఒక దేవాలయాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. బ్రిటిష్ కొలంబియాలోని పురాతన దేవాలయాలలో ఒకటైన సర్రేలోని లక్ష్మీ నారాయణ్ మందిర్ గోడలు, గేటుపై ఖలిస్తాన్ అనుకూల పోస్టర్లు అతికించారు. ఉగ్రవాది హర్‌దీప్ నిజ్జార్ హత్యలో భారత్ పాత్రపై కెనడా దర్యాప్తు చేపట్టాలని పోస్టర్లలో డిమాండ్ చేశారు. కాగా, నిజ్జార్ హత్యలో భారతీయ ఏజెంట్ల పాత్ర ఉందని ఆరోపణలు చేసిన కెనడా.. ఇంత వరకూ ఎటువంటి ఆధారాలను బయటపెట్టలేదు. ఇదే సమయంలో ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్రపన్నారని ఆరోపిస్తూ ఓ భారతీయుడ్ని అమెరికా అదుపులోకి తీసుకుంది. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు సమర్పిస్తే దర్యాప్తు చేపడతామని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com