పేరుకే అగ్రరాజ్యం.. ఎన్నికల ఫలితాలు గందరగోళం!

పేరుకే అగ్రరాజ్యం.. ఎన్నికల ఫలితాలు గందరగోళం!
పేరుకే అగ్రరాజ్యం.. అతి పెద్ద ప్రజాస్వామ్యం.. కానీ ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు చూస్తే.. మరి ఇంత గందరగోళమా అని అనుమానం కలగకమానదు. ప్రపంచ దేశాలన్నీ అమెరికాను..

పేరుకే అగ్రరాజ్యం.. అతి పెద్ద ప్రజాస్వామ్యం.. కానీ ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు చూస్తే.. మరి ఇంత గందరగోళమా అని అనుమానం కలగకమానదు. ప్రపంచ దేశాలన్నీ అమెరికాను పెద్దన్నగా భావిస్తాయి.. ఎందుకంటే అక్కడ ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.. కానీ అధ్యక్ష ఎన్నికలు వచ్చేసరికి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. 50 రాష్ట్రాల ఫలితాలు తెలుసుకోడానికి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.. అత్యంత ఎక్కవ జనాభా, ఎక్కువ రాష్ట్రాలు ఉన్న దేశాల ఫలితాలు కొన్ని గంటల్లోనే వెలువడుతుంటే.. అమెరికాలో పరిస్థితి భిన్నంగా ఉంది. అత్యాధునిక టెక్నాలజీ.. మెరుగైన వ్యవస్థలు ఉన్నా.. ఎన్నికల ఫలితాల్లో మాత్రం తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. ప్రపంచంలో ఇంకెక్కడా ఇంత గందరగోళం కనిపించదేమో.. వ్యవస్థలోనే అడుగడుగునా లోపాలు ఉన్నాయి. సాధరణంగా ఫేస్ టు ఫేస్‌ వార్‌లో ఎక్కువ ఓట్లు వచ్చినా వారు విజేతగా నిలవాలి.. కానీ అమెరికాలో జో బైడెన్‌ రికార్డు స్థాయిలో ఓట్లు సాధించినా.. విజేత ఎవరు అని చెప్పే పరిస్థితి లేదు. మరోవైపు అధికారంలో ఉన్న పార్టీ తమకు అనుకూలంగా ఉండే ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక నియోజకవర్గంగా మార్చుకొనే సౌలభ్యమూ ఉంది.. 'జెర్రీ మాండరింగ్‌'గా పిలిచే ఈ ఏర్పాటును అధికారంలో ఉన్న పార్టీలు ఎప్పటికప్పుడు తమకు అనుకూలంగా మలచుకుంటాయి.

అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశంగా చెప్పొకొనే అమెరికాలో ఒక జాతీయ ఎన్నిక కమిషన్‌ కూడా ఉండదు.. ఇంత పెద్ద దేశంలో జాతీయ స్థాయి ఎన్నికల కమిషన్‌ లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఫెడరల్‌ వ్యవస్థను పాటించే భారత్‌, కెనడా, మెక్సికోవంటి దేశాల్లో జాతీయ స్థాయి ఎన్నికల నిర్వహణకు ప్రత్యేకంగా ఎన్నికల సంఘం ఉంటుంది. ఇక్కడ అధ్యక్ష ఎన్నికలకు బాధ్యత వహించే కమిషన్‌ అంటూ ఉండదు. రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాలే అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తాయి. మొత్తం 50 రాష్ట్రాలకుగానూ 33 చోట్ల రాజకీయ నాయకులను ప్రధాన ఎన్నికల కమిషనర్లుగా నియమించుకునే వెసులుబాటు ఉంది. వారి వ్యక్తిత్వం ఆధారంగానే ఎన్నికల సంఘాల నిష్పక్షపాత వ్యవహారశైలి ఆధారపడి ఉంటుంది. చాలా చోట్ల ఎన్నికల కమిషనర్లు పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకుంటుండడంతో వివాదాలకు ఆస్కారం కలుగుతోంది. ఎన్నికలు నిర్వహించే అధికార్లకు పెద్దగా అధికారాలు ఉండవు. ప్రత్యేక సందర్భాల్లో విచణక్షను ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఎన్నికల వివాదాల పరిష్కారానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు లేవు. రాష్ట్రానికొక నిబంధన ఉండడంతో పరిష్కారానికి కూడా రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. వాటి పరిధులు కూడా వేరువేరుగా ఉంటాయి. ఎన్నికల వ్యాజ్యాలపై కోర్టులు చాలా ఆలస్యంగా తీర్పు ఇస్తుంటాయి. వీటిని పరిష్కరించే నైపుణ్యం న్యాయమూర్తుల్లో తక్కువగా ఉంటుందన్న అభిప్రాయాలూ ఉన్నాయి.

అధ్యక్ష ఎన్నికల విషయంలో జాతీయ స్థాయి ఒక నిబంధన అంటూ ఉండదు. ఓట్ల నమోదు, ఎలొక్టరల్‌ కాలేజీ, పోస్టల్‌ బ్యాలెట్‌ తదితర అంశాల్లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే అన్నట్టుగా నిబంధనలు ఉంటాయి. అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ రాష్ట్రం నిబంధనల ఆధారంగా తేల్చాలన్నది కష్టంగా మారుతోంది. అలాగే ఓటింగ్‌ లో గుర్తింపు కార్డు కూడా పెద్ద సమస్యగానే కనిపిస్తోంది. ఓటు వేసేముందు గుర్తింపు కార్డులు చూపించడం అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో సర్వసాధారణంగా మారింది. ఇందుకు దాదాపుగా ఒకేలాంటి నిబంధనలను పాటిస్తున్నాయి. అమెరికా దేన్ని గుర్తింపుకార్డుగా పరిగణిస్తారో, దేన్ని తిరిస్కరిస్తారో తేల్చి చెప్పడం కష్టం. కొన్ని వర్గాలకు ఓటు హక్కు లేకుండా చేయడం, ఓటు ఉన్నా దాన్ని వేయకుండా అడ్డంకులు కలిగించడం ఇక్కడి పార్టీల సాధారణ లక్షణం. కొంతమందికి ఓటు వేసే అవకాశం కూడా ఉండదు..

ఓట్ల లెక్కింపునకూ ఓ విధానం అంటూ లేదు. రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా కూడా రూల్స్‌ మారే సందర్భాలు ఉంటాయి. పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో ఈ టెన్షన్‌ ఎక్కువగా ఉంటుఎంది. అందుకే వివాదాలు అధికంగా ఉంటాయి. మరోవైపు అందరూ ఓటేయడానికి వీలుగా ఎన్నికల రోజును సెలవుగా ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆనవాయితీ. కొన్ని దేశాలయితే వారంతపు సెలవుల్లో ఎన్నికలు పెట్టుకుంటాయి. కానీ అమెరికాలో మాత్రం ఓటింగ్‌ రోజు కూడా పనిదినమే. ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. జాబితాలో పేరు చేర్పించుకునే బాధ్యత ఓటరుదే. ఇందుకూ నిబంధనలు ఒక్కలా ఉండవు. రాష్ట్రానికొక రూలు. ప్రభుత్వమూ ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయదు. ఈ బాధలు పడలేక పేర్లు నమోదు చేయించుకోవడానికి ఇష్టపడనివారు ఎందరో.

Tags

Read MoreRead Less
Next Story