America: అమెరికాపై ఉగ్రవాదుల కన్ను.. డేంజర్ బెల్స్ మోగిస్తున్న నిఘా వర్గాలు..

America (tv5news.in)
America: అఫ్గానిస్థాన్‌లో ఇకపై ఉగ్రవాదం ఉండబోదు అని అమెరికా స్టేట్‌మెంట్ ఇచ్చిన కొన్నిరోజులకే తాలిబన్లు పూర్తిగా ఆ దేశాన్ని ఆక్రమించేసుకున్నారు. రోజురోజుకు మనుషులం అన్న విషయాన్ని మర్చిపోయి అక్కడి ప్రజలను చిత్రహింసలు పెడుతున్నారు. తాలిబన్లు ఒక్కసారిగా అధికారంలోకి రావడంతో కనుమరుగయిన ఉగ్రవాద సంస్థలు కూడా వెలుగులోకి రావాలనుకుంటున్నాయి. ఒకవేళ అలా జరిగితే అన్నింటికంటే ఎక్కువ నష్టం అమెరికాకే అంటున్నారు నిపుణులు.
అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రసంస్థలు మళ్లీ ప్రజలను శాసించాలని నిర్ణయించుకున్నాయి. ఇలా జరిగితే అమెరికాపై ఉగ్రదాడి తప్పదని అక్కడి నిఘా వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే అమెరికాపై ఉగ్రదాడి విషయంలో ఆ దేశ ప్రభుత్వాన్ని పలుమార్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. కానీ ఈసారి ఆ ప్రమాదం మరింత దగ్గరపడుతుందని వారి అంచనా.
అఫ్గానిస్థాన్, అమెరికాకు ఇప్పటివరకు పెద్దగా సన్నిహిత సంబంధాలు లేవు. తాలిబన్ల ఆక్రమణ మొదలయ్యే కొంతకాలం ముందు ఇకపై వారు మామూలుగా ఉండాలని ఇరుదేశ ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం తారుమారయ్యింది. దేశాల మధ్య సంబంధాలు మళ్లీ మొదటికే వచ్చాయి.
నిజానికి ఇస్లామిక్ స్టేట్.. తాలిబన్లకు శత్రువే. తాలిబన్ల పాలన మొదలయిన తర్వాత అఫ్గాన్‌లో ఐఎస్ అనేక దాడులు జరిపి వందల మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో ఐఎస్‌తో పోరాటానికి తాలిబన్ సిద్ధమయ్యింది. కానీ ముందు నుండి ఎంతో బలం, బలగం ఉన్న ఇస్లామిక్ స్టేట్ ముందు తాలిబన్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువ. ఇలా ఐఎస్, తాలిబన్‌కు జరుగుతున్న గొడవల వల్ల అమెరికాపై ప్రభావం పడనుంది.
ఇస్లామిక్ స్టేట్‌లో కొన్ని వేల మంది ఉగ్రవాదులు ఉన్నారు. అమెరికాపై దాడి కోసం ఆ సంస్థ వారందరినీ ట్రెయిన్ చేస్తోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో పాటు ఆల్‌ఖైదా నుండి కూడా ముప్పు పొంచి ఉందని పెంటగాన్ అధికారులు అంటున్నారు. ఐఎస్‌ను ఎదుర్కునేందుకు ఆల్‌ఖైదా, తాలిబన్లు చేతులు కలిపే అవకాశం ఉందని వారు అన్నారు. ఇక రానున్న రెండేళ్లలో వీరంతా కలిసి అమెరికా భూభాగంపై దాడులు చేసే ప్రమాదం ఉందని వారు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com