America Protests: అమెరికాలో ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు

అమెరికాలో మళ్లీ ఆందోళనలు జరుగుతున్నాయి. మరోసారి ఆ దేశ ప్రజలు రోడ్డెక్కారు. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై తమ అసంతృప్తిని తెలిపారు. భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. దేశంలోని పలు నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో ఈ నిరసనలు ఎక్కువగా కనిపించాయి.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన విధానాలకు వ్యతిరేకంగా ‘50501’ నిరసనలో భాగంగా అమెరికా అంతటా వేలాది మంది నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన విధానాలకు వ్యతిరేకంగా జరిగిన రెండవ నిరసన ప్రదర్శన ఇది. న్యూయార్క్, వాషింగ్టన్ డిసి సహా పలు నగరాల్లో వేలాది మంది నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. 50 రాష్ట్రాల్లో 50 నిరసనలు.. ఐక్య ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్యకర్త సమూహం 50501 నాయకత్వం వహించింది. దేశవ్యాప్తంగా 400 కి పైగా ప్రదర్శనలు ప్లాన్ చేయబడ్డాయి. అమెరికా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని నినాదాలతో కూడిన బోర్డులు, ప్లకార్డులతో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.
అమెరికాలో రాజులు ఎవరూ లేరు’, ‘ఈ దౌర్జన్యాన్ని ఎదిరించండి’ వంటి నినాదాలతో ప్రజలు నిరసన తెలిపారు. ముఖ్యంగా, తాత్కాలిక వలసదారులకు కల్పించిన చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయడం, వారిని దేశం నుంచి బహిష్కరించే ప్రభుత్వ నిర్ణయాలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎలాంటి భయం లేదు.. వలసదారులకు స్వాగతం’ అంటూ వలసదారులకు మద్దతుగా నినాదాలు చేశారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ట్రంప్ పాలన ఉందని ప్రజలు మండిపడుతున్నారు. ట్రంప్ తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
ట్రంప్ విధానాల పట్ల అమెరికాలో అసంతృప్తి పెరిగిపోతోంది. అక్కడి ప్రజలు రగిలిపోతున్నారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అక్కడ ఆందోళనలు, నిరసనలు జరగడం ఇదేం తొలిసారి కాదు. ఆయన పాలన పట్ల అసంతృప్తితో ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పలుమార్లు ఆందోళనలు జరిగాయి. ‘హ్యాండ్సాఫ్’ పేరుతో 50 రాష్ట్రాల్లోని దాదాపు 1,200 ప్రాంతాల్లో భారీ ఎత్తున శాంతియుత నిరసన ప్రదర్శనలు జరిగాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com