US, RUSSIA: ఖైదీల విడుదలకు అమెరికా-రష్యా ఒప్పందం

అమెరికా, రష్యాల మధ్య నానాటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్నవేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాలు మొత్తం 24 మంది ఖైదీలను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత వాషింగ్టన్, మాస్కో మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించి అతిపెద్ద ఒప్పందమిదే. ఇందులో భాగంగా- అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్ష్‌కోవిచ్, కార్పొరేట్ సెక్యూరిటీ ఉద్యోగి పాల్ వేలన్‌తోపాటు రష్యా విమర్శకుడు కారా ముర్జా (పులిట్జర్ విజేత)ను రష్యా విడుదల చేసింది. జాబితాలో 11 మంది రాజకీయ ఖైదీలు ఉన్నారు. దివంగత రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ సహచరులు కూడా వారిలో ఉండటం గమనార్హం. వారి విడుదలకు బదులుగా మాస్కో భారీగానే ప్రయోజనం పొందింది.
బెర్లిన్‌లో చెచెన్ తిరుగుబాటుదారుడిని హత్య చేసిన అభియోగంపై జర్మనీలో శిక్ష అనుభవిస్తున్న వాదిమ్ క్రాసికోవ్, స్లొవేనియాలో జైలుపాలైన ఇద్దరు స్లీపర్ ఏజెంట్లు, అమెరికాలో అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు రష్యన్లు సహా మరికొందరిని విడుదల చేయించుకుంది. వారిలో కంప్యూటర్ హ్యాకర్ రోమన్ సెలెజ్నెవ్ ఉన్నారు.
ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశమున్న కమలా హారిస్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జాతిపరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె భారతీయురాలా.. ఆఫ్రో అమెరికనా అని ప్రశ్నించారు. దీనిపై వెంటనే కమలా హారిస్ స్పందించారు. ఆయన పాత చింతకాయ పచ్చడిలాంటి అంశాన్ని లేవనెత్తుతున్నారని, విభజన వాదానికి ఆజ్యం పోస్తున్నారని, వ్యక్తులను అగౌరవపరుస్తున్నారని ధ్వజమెత్తారు. షికాగోలో జరిగిన సదస్సులో ఆఫ్రో అమెరికన్లపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఓ మహిళా జర్నలిస్టు గుర్తు చేయంగా.. ట్రంప్ ఆమెపై రుసరుసలాడారు. ఆమె ఒక మూర్ఖురాలు అని తిట్టిపోశారు. లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ నేతలు కమలా హారిస్ అనే తోలుబొమ్మను ఎన్నికల్లో పోటీకి దింపుతున్నారని ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. విరాళాలిచ్చే దాతలు, రాజకీయ దళారుల నియంత్రణలో ఆమె పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పెన్సిల్వేనియాలోని హారిస్‌బర్గ్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. నాలుగు వారాల కిందట అత్యంత చెత్త ఉపాధ్యక్షురాలిగా ఆమెను పేర్కొన్నారని, ఒక్కసారిగా ఆమెను మార్గరెట్ థాచర్‌లా మార్చేశారని వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com