Donald Trump: బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదంపై ట్రంప్ హర్షం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధించారు. ట్రంప్ కలల బిల్లు అయిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. గురువారం అమెరికన్ కాంగ్రెస్‌లో సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. బిల్లు ఆమోదంతో రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్‌కు ఘన విజయం దక్కినట్లయింది. తన కలల బిల్లుకు ఆమోదం లభించడంపై అధ్యక్షుడు ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. అమెరికాకు ఒక ‘కొత్త స్వర్ణయుగం’ ప్రారంభమైందంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు.
దేశ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో ‘అమెరికాకు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కంటే మెరుగైన పుట్టినరోజు బహుమతి మరొకటి ఉండదు’ అంటూ వ్యా్ఖ్యానించారు. ‘ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను ఆమోదించారు. మన పార్టీ ఎన్నడూ లేనంత ఐక్యంగా ఉంది. ఈ బిల్లుతో అమెరికా ప్రజలు మరింత ధనవంతులుగా, సురక్షితంగా, గర్వంగా జీవిస్తారు’ అని ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ వియానికి గుర్తుగా శుక్రవారం సాయంత్రం ఈ బిల్లుపై వైట్‌హౌస్‌లో సంతకాల సేకరణ ఉంటుందని ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల శాసనసభ్యులు, సెనేటర్లను ట్రంప్ ఆహ్వానించారు.
4.5ట్రిలియన్ డాలర్ల పన్ను తగ్గింపులు, మెడికెయిడ్, ఫుడ్ స్టాంప్‌లలో 1.2 ట్రిలియన్ డాలర్ల కోతలు, సరిహద్దు భద్రతకు నిధులు సమకూర్చడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమానికి నిధులు కేటాయించడం వంటి లక్ష్యాలతో ట్రంప్ సర్కార్ ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డెమోక్రాట్లతోపాటూ, కొందరు రిపబ్లికన్లు సైతం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు కారణంగా టెస్లా బాస్ ఎలాన్ మస్క్, అధ్యక్షుడు ట్రంప్ మధ్య విభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. కాగా, ఈ బిల్లు ఆమోదం పొందితే తాను కొత్తపార్టీ పెడతానని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజే ‘అమెరికన్ పార్టీ’ పేరిట కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com