Kenya: కెన్యాలో అంతుచిక్కని వ్యాధి

Kenya: కెన్యాలో అంతుచిక్కని వ్యాధి
సరిగ్గా నడవలేకపోతున్న 95 మంది బాలికలు

కెన్యాలోని ఓ స్కూలు బాలికల్లో మిస్టరీ వ్యాధి వెలుగు చూసింది. కకామెగా టౌన్‌లోని సెయింట్‌ థెరిసాస్‌ ఎరెగీ బాలికల ఉన్న పాఠశాలలో చదువుతున్న 95 మంది బాలికలను బుధవారం ఒక్కసారిగా అనారోగ్యం బారిన పడ్డారు. వారి కాళ్లలో పక్షవాతం మాదిరి లక్షణాలు కనిపించాయి. వారిలో కొందరిలో మూర్చ లక్షణాలున్నట్లు అధికారులు తెలిపారు. దాంతో వారు నడవలేని స్థితిలో ఒకరిచేయి మరొకరు పట్టుకుని వెళ్తున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఉదంతం తర్వాత స్కూలుకు సెలవులు ప్రకటించామని, బాధిత బాలికలను ఆస్పత్రిలో చేర్పించామని అధికారులు తెలిపారు.


కెన్యాలోని సెయింట్‌ థెరీసాలో ఉన్న ఓ హైస్కూలులో చదువుతున్న బాలికలు అకస్మాత్తుగా వింత వ్యాధి బారిన పడ్డారు. ఒక్కసారిగా ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 95 మంది బాలికల కాళ్లకు పక్షవాతం వంటి వ్యాధి సోకింది. దీంతో వారు సరిగ్గా నడవలేకపోతున్నారు. కొందరిలో వాంతులు కూడా మొదలయ్యాయి. ఈ వింత వ్యాధికి కారణాలేమిటో తెలుసుకునేందుకు కెన్యా ప్రభుత్వంరంగంలోకి దిగింది . బాధితుల రక్త నమూనాలను కెన్యా మెడికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. మందులకు కొంతమంది సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ మరి కొంతమందికి ఎలాంటి మార్పు కనపడటం లేదు. మెరుగైన చికిత్స అందించేందుకు బాధితులను ఆసుపత్రికి తరలించారు.


శరీరంలో నీటిని కోల్పోవడం లేదా ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా ఇలాంటి అనారోగ్యం సంభవించవచ్చని వైద్యులు చెప్పినట్టుగా స్థానిక నివేదికలు తెలిపాయి. శరీరంలోని మినరల్ కంటెంట్ చాలా తక్కువగా లేదా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వలన నోరు పొడిబారడం, దాహం, చంచలత్వం, గందరగోళం లేదా కండరాల బలహీనత, తిమ్మిరి లేదా జలదరింపు, అలసట, గుండె దడ, వికారం, వాంతులు కలుగుతాయి. అలా హృదయ స్పందన రేటు తగ్గుతుంది. రక్తపోటులో కూడా మార్పు వస్తుంది. కొద్దీ రోజులపాటు పరిస్థితిని అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకున్న తర్వాత విద్యార్థులను తిరిగి పాఠశాలకు అనుమతిస్తామని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story