ISS: అంతరిక్షంలోకి మరో భారత వ్యోమగామి

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా ఈ ఏడాది మేలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. జెఫ్ బెజోస్‌కు చెందిన ఆక్సియం మిషన్-4 ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు నాసా మాజీ వ్యోమగామి, మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్‌స్కీ, హంగేరికి చెందిన టిబోర్ కాపు కూడా ఉన్నారు. ఈ ప్రైవేట్ అస్ట్రోనాట్స్ ఒకసారి ISSకు చేరుకున్న తర్వాత 14 రోజులు వారు అక్కడే ఉండనున్నారు. 1984లో వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లనున్న రెండో భారతీయుడిగా శుభాన్షు శుక్లా చరిత్రకెక్కనున్నారు.
నాసా, ఆక్సియమ్‌తో ఇస్రో ఒప్పందం
దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒక భారతీయుడు తిరిగి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఇస్రో నిర్వహించబోయే గగన్‌యాన్ మిషన్‌కు శుభాన్షును కీలకమైన వ్యోమగామిగా గుర్తించారు. అనంతరం ఆయన్ను ఆక్సియం-4కు ఎంపిక చేశారు. కాగా, ఇస్రో నిర్వహించే గగన్‌యాన్ మిషన్‌లో ముగ్గురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల కంటే తక్కువ ఎత్తులోని భూకక్ష్యలోకి పంపనున్నారు. ఈ మిషన్ కోసం నాసా, ఆక్సియమ్‌లతో కలిసి ఇస్రో పని చేస్తుంది. ఇండియా నుంచి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను డిసిగ్నేటెడ్ ఆస్ట్రనాట్‌గా ఎంపిక చేశారు. ఏవైనా కారణాలతో శుభాన్షు శుక్లా వెళ్లలోకపోతే నాయర్ ఆక్సియమ్-4లో ప్రయాణం చేస్తారు.
శుభాన్షు శుక్లా ఎవరు?
అక్టోబర్ 10, 1985న లక్నోలో జన్మించిన శుభాన్షు శుక్లా విమానయానం పట్ల తొలి దశలోనే మక్కువ చూపారు. జూన్ 2006లో యుద్ధ విమాన పైలట్‌గా భారత వైమానిక దళం (IAF)లో చేరారు. మార్చి 2024లో గ్రూప్ కెప్టెన్ హోదాను పొందారు.సుఖోయ్ Su-30, గురేవిచ్ MiG-21,మికోయన్-గురేవిచ్ MiG-29, జాగ్వార్, హాక్, డోర్నియర్ 228, ఆంటోనోవ్ An-32 వంటి పలు విమానాలలో 2,000 కంటే ఎక్కువ గంటలు ప్రయాణించారు.
శుభాన్షు పేరు ప్రకటించిన మోదీ
2019లో రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో వ్యోమగామి శిక్షణను పూర్తి చేశారు. ఈ ట్రైనింగ్ ఆయన జీవితంలో మార్పు తెచ్చింది. 2024 ఫిబ్రవరి 27న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్లాను భారతదేశం మొట్టమొదటి మానవ అంతరిక్ష మిషన్ అయిన గగన్‌యాన్ కోసం శిక్షణ పొందుతున్న ఎలైట్ అస్ట్రోనాట్స్‌లో ఒకరిగా ప్రకటించారు. ఈ మిషన్ 2025లో ప్రారంభించనున్నట్లు ISRO తెలిపింది. ఆయన అనుభవం, నైపుణ్యం భారతదేశం అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయిగా నిలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com