Drone Strike: ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ అలజడి..

Drone Strike: ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ అలజడి..
X
ఓడలపై దాడులు తీవ్రం

ఇజ్రాయెల్‌ హమాస్‌ మధ్య పోరాటం నేపథ్యంలో ఎర్రసముద్రంలో హౌతీ రెబల్స్‌ నౌకలపై వరుస దాడులు చేస్తూ తీవ్ర అలజడి సృష్టిస్తున్నారు . భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకపై శనివారం డ్రోన్‌ దాడి జరిగిన రోజే.. మరో రెండు నౌకలపై హౌతీ రెబల్స్‌ దాడి చేశారని అమెరికా ప్రకటించింది. అందులో ఒకదానిలో 25 మంది భారతీయులుఉన్నారు. మరో నౌకపై నార్వే జెండా ఉంది. ఎర్రసముద్రంలో హౌతీల ఆటకట్టించేందుకు రంగంలోకి దిగిన అమెరికా.. స్థానిక దేశాల సహకారంతో తమ సైన్యాన్ని అక్కడ మోహరిస్తోంది.

ఎర్రసముద్రంలో హౌతీ రెబల్స్‌ సృష్టిస్తున్న అలజడి తీవ్ర రూపం దాల్చింది. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను ఆపేదాకా ఎర్రసముద్రంలో నౌకలపై దాడులు కొనసాగిస్తామని చెప్పినట్లుగానే మిలిటెంట్లు భారీ షిప్‌లను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నారు.. గాబన్‌ జెండా ఉండి భారత్‌వైపు వస్తున్న MV సాయిబాబా అనే వాణిజ్య క్రూడ్‌ ఆయిల్‌ ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి జరిగిందని అమెరికా సైన్యం తెలిపింది. దాడి జరిగిన సమయంలో సాయిబాబా నౌకలో 25 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఐతే వారిలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. దాడి చేసింది హౌతీ రెబల్లేనని US సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది. భారత్‌కు వస్తున్న నౌక కావడంతో ప్రస్తుత పరిస్థితిని భారత నౌకాదళం కూడా నిశితంగా గమనిస్తోంది.


ఇదే సమయంలో ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న ఎంవీ బ్లామనెన్‌ అనే నౌకపైన కూడా డ్రోన్‌ దాడి జరిగిందని అమెరికా గుర్తించింది. బ్లామనెన్‌పై నార్వే జెండా ఉందని తెలిపింది. ఫలితంగా అక్టోబర్‌ 17 తర్వాత వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల సంఖ్య 15కు చేరినట్లు పేర్కొంది.

మరోవైపు ఎర్రసముద్రంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా మోహరించిన USS లబున్‌ యుద్ధనౌకపై కొన్ని డ్రోన్లు దాడికి యత్నించగా వాటిని యుద్ధనౌక కూల్చివేసింది. హౌతీ రెబల్స్‌ దాడులను నిలువరించేందుకు అమెరికా రంగంలోకి దిగినట్లు తెలిసింది. రెడ్‌సీలో ఇతర దేశాల సహకారంతో తమ సైన్యాన్ని మోహరించి.. గస్తీని పెంచాలని US యోచిస్తోంది. ఆపరేషన్‌ ప్రాస్పిరిటీ గార్డియన్‌ పేరుతో ఎర్ర సముద్రంలో నిరంతర గస్తీ చేపడ్తామని USఎయిర్ ఫోర్స్ మేజర్ జనరల్ పాట్ రైడర్ చెప్పారు. అంతర్జాతీయ సమాజ శ్రేయస్సు కోసం ఈ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. హౌతీ ఉపద్రవం దృష్ట్యా బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిలో ప్రయాణించకూడదని నౌకలను యాజమాన్య సంస్థలు ఆదేశిస్తున్నాయి.గాజాలో యుద్ధం ఆపేంతవరకు తాము ఎర్రసముద్రంలో ప్రయాణించే నౌకలపై దాడులు చేస్తామని గతంలో ఇరాన్‌ మద్దతున్న యెమెన్‌ సైన్యం హోతీ రెబల్స్‌ ప్రకటించారు. గతంలో గెలాక్సీ లీడర్‌ అనే ఓ భారీ వాణిజ్య నౌకను ప్రత్యక్షంగా హెలికాప్టర్‌లో వచ్చి రెబల్స్‌ స్వాధీనం చేసుకున్నారు

Tags

Next Story