Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య... ఇటీవలి వారాల్లో ఇది ఐదో ఘటన

Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య...  ఇటీవలి వారాల్లో ఇది ఐదో ఘటన
X
మైనార్టీల భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు

బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై దాడుల పరంపర కొనసాగుతోంది. దేశంలో నెలకొన్న అశాంతి నేపథ్యంలో, తాజాగా మరో హిందూ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఇటీవలి వారాల్లో ఇది ఐదో ఘటన కావడం గమనార్హం.

జషోర్ జిల్లాలోని మణిరాంపూర్ ఉపజిల్లా కపాలియా బజార్‌లో సోమవారం సాయంత్రం 5:45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని సమీపంలోని అరువా గ్రామానికి చెందిన రాణా ప్రతాప్ (45)గా గుర్తించారు. ఆయన బజార్‌లో ఉన్న సమయంలో దుండగులు కాల్పులు జరిపి హత్య చేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

గత నెలలో విద్యార్థి నాయకుడు షరీఫ్ ఒస్మాన్ హాదీ హత్యకు గురైన నాటి నుంచి బంగ్లాదేశ్‌లో ఆందోళనలు, హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఈ అశాంతి వాతావరణంలోనే హిందువులపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఇటీవల మైమెన్‌సింగ్‌లో దైవదూషణ ఆరోపణలతో దీపు చంద్ర దాస్‌ను, రాజ్‌బరీ జిల్లాలో అమృత్ మోండల్‌ను మూకదాడుల్లో హత్య చేశారు. అలాగే, మెహ్రబరీలో బంగ్లాదేశ్ అన్సార్ దళ సభ్యుడు బజేంద్ర బిస్వాస్‌ను కాల్చి చంపగా, షరియత్‌పూర్‌లో ఖోకన్ చంద్ర దాస్ అనే వ్యాపారిని పెట్రోల్ పోసి నిప్పంటించి చంపారు.

ఈ వరుస హత్యలతో బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, కొన్ని ఘటనల్లో మతపరమైన కోణం లేదని తాత్కాలిక ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, హింస మాత్రం ఆగడం లేదు. ఈ హత్యలకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేసినట్లుగానీ, దర్యాప్తు వివరాలను గానీ వెల్లడించలేదు.

మైనారిటీ వితంతువుపై గ్యాంగ్‌ రేప్‌

బంగ్లాదేశ్‌లోని ఝెనైడా జిల్లాలో శనివారం రాత్రి ఓ మైనారిటీ వితంతువుపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను చెట్టుకు కట్టి, జుట్టు కత్తిరించారు. చిత్రహింసలకు గురి చేశారు. 40 ఏండ్ల వయసు గల ఆ మహిళను రెండున్నరేండ్ల నుంచి వీరిద్దరూ వేధిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. స్పృహ కోల్పోయిన బాధితురాలిని స్థానికులు కాపాడి, దవాఖానకు తరలించారు. వైద్యులు మాట్లాడుతూ, జరిగిన నేరం గురించి ఆమె చెప్పలేదని, వైద్య పరీక్షల్లో వెల్లడైందని చెప్పారు.

Tags

Next Story