China New Virus : చైనాలో కొవిడ్‌ తరహా కొత్త వైరస్‌

China New Virus : చైనాలో కొవిడ్‌ తరహా కొత్త వైరస్‌
X
గబ్బిలాల్లో గుర్తించిన పరిశోధకులు.. మనుషులకూ వ్యాపించగలదని ప్రకటన

చైనాకు చెందిన పరిశోధకులు ఓ కొత్త రకమైన కరోనా వైరస్‌ను గుర్తించారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్‌ను హెచ్‌కేయూ5-కోవ్‌-2గా పిలుస్తున్నారు. కొవిడ్‌-19కు కారణమైన సార్స్‌-కోవ్‌-2ను ఈ వైరస్‌ పోలి ఉందని, మనుషులకు సైతం ఇది సోకగలదని తేల్చారు. గబ్బిలాల్లో వైరస్‌లపై అధ్యయనాలతో ‘బ్యాట్‌వుమన్‌’గా ప్రాచుర్యం పొందిన షి జెంగ్లీ అనే వైరాలజిస్ట్‌ నేతృత్వంలోని పరిశోధకులు ఈ వైరస్‌ను గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ‘సెల్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ వైరస్‌ మెర్బెకోవైరస్‌ ఉప రకానికి చెందినదని, ఇందులో మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌(బెర్స్‌) వైరస్‌ కూడా ఉందని పరిశోధకులు తెలిపారు. ఇది హాంకాంగ్‌లోని జపనీస్‌ పిపిస్ట్రెల్‌ గబ్బిలాల్లో మొదటిసారి గుర్తించిన హెచ్‌కేయూ5 కరోనా వైరస్‌ శ్రేణికి చెందినదని చెప్పారు. ఈ వైరస్‌ మనుషులకు నేరుగా లేదా ఇతర జీవాల ద్వారా సోకే ముప్పు ఉందని హెచ్చరించారు. అయితే, కొవిడ్‌-19కు కారణమైన సార్స్‌-కోవ్‌-2 కంటే దీని ప్రభావం తక్కువే ఉంటుందని వెల్లడించారు.

గాంగ్ జౌ ల్యాబోరేటరీ, గాంగ్ జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ యూనివర్సిటీతో పాటు వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి చెందిన సైంటిస్టులు భాగస్వాములుగా ఉన్నారు. సైంటిఫిక్ జర్నల్ సెల్ లో దీనికి సంబంధించిన పరిశోధన నివేదికను ప్రచురించారు. ఈ వైరస్ మానవ కణాలకు, కృత్రిమంగా పెరిగిన ఊపిరితిత్తులు, పేగు కణజాలాలకు సోకుతుందని ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైంది. మానవులు, గబ్బిలాలు, ఇతర జంతువులలోని ACE2 గ్రాహకాలతో కూడా బైండ్ అవగలదు.

కొవిడ్ వైరస్ మొదటి కేసు 2019 డిసెంబర్ లో సెంట్రల్ చైనాలోని వుహాన్‌లో నమోదైంది. ఈ వైరస్ చైనాను గడగడలాడించింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి సమస్త మానవాళిని బెంబేలెత్తించింది. లాక్‌డౌన్లకు దారితీసింది. కంటికి కనిపించని ఈ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. దాదాపు 70 లక్షల మంది మరణాలకు కారణమైంది.

Tags

Next Story