Anti Rape Bill In Pakistan: రేపిస్టులకు ఇలాగే జరగాలి.. జరుగుద్ది.. అంటున్న పాకిస్థాన్ ప్రభుత్వం..
Anti Rape Bill In Pakistan: దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఆపడానికి ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో కొత్త చట్టాలను ప్రవేశపెట్టాయి. కానీ అలాంటి వాటికి భయపడి తప్పు చేయాలి అనుకునేవారి ఆలోచన ఏమైనా మారిందా అంటే లేదు అనే చెప్పాలి. ప్రపంచంలో ఏ మూలా.. ఏ అమ్మాయి కూడా ఈ చట్టాల వల్ల సేఫ్‌గా ఫీల్ అవ్వట్లేదు. తప్పు చేయాలనుకున్న ఈ మనిషి వీటి వల్ల భయపడట్లేదు. అందుకే పాకిస్థాన్ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.
ఇండియాలో జరిగిన నిర్భయ ఘటన గురించి ఇప్పుడే కాదు ఇంకొక పదేళ్లయినా.. ప్రజలు ఎవరూ మర్చిపోరు. ఇది ప్రజల్లో తిరుగుబాటుకు దారితీసింది. చట్టాలలో మార్పులు తీసుకొచ్చింది. కానీ నిర్భయ ఘటన గురించి విన్నప్పుడు అమ్మాయిలు ఎంత భయపడతారో.. నిర్భయ చట్టం గురించి విన్నప్పుడు తప్పు చేయాలనుకుంటున్న వారు అంతగా భయపడట్లేదు. అందుకే అంతకంటే భయంకరమైన చట్టాలను ప్రవేశపెట్టాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి చట్టాలు పాకిస్థాన్‌లో కూడా ఎన్నో ఉన్నాయి. అయినా గత కొంతకాలంగా అక్కడ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అందుకే ఆ ప్రభుత్వం రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ శిక్ష విధించాలని నిర్ణయించుకుంది. దాదాపు ఏడాది క్రితం పాకిస్తాన్ మంత్రివర్గం ఆమోదించిన ఈ శిక్ష త్వరలోనే అమల్లోకి రానుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది.
కెమికల్ కాస్ట్రేషన్ అనేది ఓ మెడికల్ ప్రక్రియ. ఈ శిక్ష అనుభవించిన వ్యక్తి ఇక తన జీవితాంతం లైంగిక చర్యలో పాల్గొనలేడు. దీని అమలు కోర్టు పర్యవేక్షణలో మెడికల్ బోర్డు ఆమోదించిన ఔషధాల ద్వారా నిర్వహించబడుతుందని పాకిస్థాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే దక్షిణ కొరియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇది ఒక చట్టపరమైన శిక్ష. ఈ శిక్ష ద్వారా అయినా మహిళలపై అఘాయిత్యాలు కంట్రోల్ అవుతాయని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com