Portuguese PM: పోర్చుగల్‌ ప్రధాని రాజీనామా

Portuguese PM:  పోర్చుగల్‌ ప్రధాని రాజీనామా
అవినీతి కేసులో బిగిసిన ఉచ్చు..

అవినీతి కేసులో పోర్చుగల్‌ ప్రధాని ఆంటోనియో కోస్టాకు ఉచ్చు బిగుస్తోంది. దాంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు, లిథియం గనుల కుంభకోణాలకు సంబంధించి ఆరోపణలు రావడంతో కోస్టా ఇంటిపై ఇటీవల పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల సందర్భంగా కోస్టా ముఖ్య సలహాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు.

అతడు ఇచ్చిన సమాచారం మేరకు కోస్టాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కోస్టా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని కోస్టా చెబుతున్నారు. దర్యాప్తులో ఏం తేలినప్పటికీ తాను మళ్లీ ప్రధాని పదవి చేపట్టనని స్పష్టంచేశారు. మరోవైపు కోస్టా రాజీనామాను పోర్చుగల్‌ అధ్యక్షుడు మార్సెలో రెబెలో ఆమోదించారు.

అదేవిధంగా పార్లమెంట్‌ను రద్దుచేసే ప్రక్రియను ప్రారంభించినట్లు రెబెలో తెలిపారు. దేశంలో మళ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించలేదన్నారు. అయితే సోషలిస్టులు మరో నేత ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఆంటోనియో కోస్టా ఆధ్వర్యంలో పోర్చుగల్‌ దేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించింది. పర్యాటక రంగం పరుగులు పెట్టింది. పెట్టుబడిదారులకు పోర్చుగల్‌ గమ్యస్థానంగా మారింది.

ఆంటోనియో కోస్టా, సోషలిస్ట్ ప్రధాన మంత్రి, 2015 నుండి అధికారంలో ఉన్నారు, మొదట వామపక్ష పార్టీలతో సహా సంకీర్ణానికి నాయకత్వం వహించారు. తరువాత మైనారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. 2022లో జరిగిన ఎన్నికలలో కోస్టా పార్లమెంటులో తన పార్టీకి సంపూర్ణ మెజారిటీని సాధించడం ద్వారా అంచనాలను తలక్రిందులు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story