PAKISTHAN PM: పాక్ అపద్ధర్మ ప్రధానిగా కాకర్ ప్రమాణం

పాకిస్థాన్ (Pakistan) ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా అన్వర్ ఉల్ హఖ్ కాకర్ (Anwarul Haq Kakar) ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్లామాబాద్‌లోని అధ్యక్షుడి నివాసం ‘ఐవాన్ ఇ సదర్’లో పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ(President Arif Alvi ) కాకర్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. అన్వర్ పాకిస్థాన్‌కు 8వ తాత్కాలిక ప్రధానమంత్రిAnwaar-ul-Haq Kakar) అయ్యారు. ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే కాకార్ పార్లమెంటు ఎగువ సభకు రాజీనామా చేశారు. సెనేట్ ఛైర్మన్ సాదిక్ సంజరాణి రాజీనామాను ఆమోదించారు. ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో తాను స్థాపించిన బలూచిస్థాన్ అవామీ పార్టీకి (BAP) సైతం కాకర్ రాజీనామా చేశారు. పాకిస్థాన్ ఎన్నికల సంఘం సహకారంతో సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం తన బాధ్యతగా భావించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కాకర్ ప్రకటించారు.
గడువుకు మూడు రోజుల ముందే ఆగస్టు తొమ్మిదో తేదీన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ను రద్దు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ పాక్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీకి లేఖ రాశారు. ఈ లేఖకు అంగీకారం తెలిపిన అల్వీ జాతీయ అసెంబ్లీను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు. ఈ నిర్ణయంతో పాకిస్థాన్ పార్లమెంట్ దిగువసభతో పాటు ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్-ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మూడు రోజుల ముందస్తుగానే రద్దైంది.
గడువు కంటే మూడు రోజుల ముందే జాతీయ అసెంబ్లీ రద్దవడంతో ఎన్నికల సంఘం 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం తన పదవీ కాలాన్ని పూర్తి చేసినట్లైతే 60 రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండేది. 2018 జులై 25న పాకిస్థాన్ ఎన్నికలు జరిగాయి. 2018 ఆగస్టు 13న 15వ పాక్ జాతీయ అసెంబ్లీ కొలువుదీరింది. ఎన్నికలు నిర్వహించేవరకు దేశంలో కాకర్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కొనసాగనుంది.
పార్లమెంట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నా జనగణన, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కారణంగా రెండు నెలల పాటు ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. పాకిస్థాన్ జనాభా గణన ఫలితాలను అత్యున్నత రాజ్యాంగ సంస్థ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నివేదిక ప్రకారం పాక్ జనాభా 240.10 మిలియన్లకు చేరుకుందని వెల్లడించింది. ఈ ఆమోదంతో నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంది. కానీ పాక్ ఎన్నికల సంఘం అంత వేగంగా ఆ ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికలు నిర్వహిస్తుందా అన్నది తెలియడం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com