Arab-Islamic Nato: అరబ్-ఇస్లామిక్ నాటో.. సైనిక కూటమి ఏర్పాటుకు ఇస్లామిక్ దేశాల యోచన

అమెరికా నేతృత్వంలోని ‘‘నాటో’’ తరహా సైనిక కూటమికి అరబ్-ఇస్లామిక్ దేశాలు సిద్ధమవుతున్నాయా..? అంటే, ఇందుకు కొన్ని దేశాలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, పాకిస్తాన్, దాని మిత్ర దేశం టర్కీలు ‘‘ అరబ్-ఇస్లామిక్’’ సైనిక కూటమి కోసం తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయి. ఇటీవల, ఖతార్‌పై హమాస్ అగ్రనాయకత్వమే లక్ష్యంగా ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఈ నేపథ్యంలో, ఇజ్రాయిల్‌ను అడ్డుకోవడానికి నాటో తరహా కూటమి కట్టాలని ఇస్లామిక్, అరబ్ దేశాలు భావిస్తున్నాయి.
సోమవారం, అరబ్, ఇస్లామిక్ దేశాల నుంచి అనేక మంది నేతలు ఖతార్ రాజధాని దోహాకు తరలివచ్చారు. గత వారం, ఇజ్రాయిల్ ఖతార్‌పై జరిపిన దాడికి సంఘీభావంగా ఈ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇజ్రాయిల్‌పై కనీస చర్యలు కాకుండా, ఖచ్చితమైన ఫలితాల కోసం అరబ్ సైనిక కూటమి అవసరమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఇస్లామిక్ ప్రపంచంలోనే అణ్వాయుధాలు కలిగిన దేశంగా పేరున్న పాకిస్తాన్ అత్యవస సమావేశానికి హాజరుకావడమే కాకుండా.. ‘‘ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్ ను అడ్డుకునేందుకు ’’ ఉమ్మడి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. టర్కీష్ అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్డొగాన్ ఇజ్రాయిల్ ను ఆర్థికంగా అణచివేయాలని పిలుపునిచ్చారు. ఇరాక్ ప్రధాని మొహమ్మద్ అల్ సుడానీ కూడా నాటో తరహా కూటమికి పిలుపునిచ్చారు.
అరబ్ ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం కలిగిన ఈజిప్ట్ ‘‘అరబ్ నాటో’’గా పేరుపెట్టి, సమిష్టి రక్షణ కవచం అవసరమని చెబుతోంది. దోహాలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు 20,000 మంది సైనికులను ప్రారంభ దశలో ఈజిప్ట్ తరుఫున అందిస్తామని చెప్పింది. అయితే, ఇది ఎంత వరకు విజయవంతమవుతుందనే దానిపై సందేహాలు కూడా ఉన్నాయి. పలువురు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, చాలా ఇస్లామిక్ దేశాలకు ఇజ్రాయిల్‌తో సంబంధాలు బాగానే ఉన్నాయి. ఓ పక్క ఈజిప్ట్ ‘‘అరబ్ నాటో’’కు మద్దతు ఇస్తుండగా, ఇరాన్ మాత్రం దీనిని ‘‘ఇస్లామిక్’’ రూపం ఇవ్వాలని చూస్తోంది. ఇది విభజనలకు దారి తీసే అవకాశం ఇస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com