US Storms: అమెరికాలో తుపాను బీభత్సం... 17 మంది మృతి

అమెరికా తూర్పు, మధ్య ప్రాంతాల్లో తుపానులు బీభత్సం సృష్టించాయి. ఈ విపత్తు కారణంగా కనీసం 17 మంది మరణించారని అధికారులు తెలిపారు. కెంటకీ, టెనెస్సీ, అలబామా ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్షపాతం, ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేసింది. టెనెస్సీ రాష్ట్రంలో తుపాను అతలాకుతలం చేసింది. ఈ ఒక్క రాష్ట్రంలోనే 10 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కెంటకీలోని జెఫెర్సన్‌టౌన్‌లో టోర్నడో కారణంగా భవనాలు ధ్వంసమయ్యాయని ఓ మీడియా రిపోర్టర్ వెల్లడించారు. సామాజిక మాధ్యమాలు, స్థానిక మీడియాలో షేర్ చేసిన ఫోటోలలో అనేక రాష్ట్రాల్లో తుపాను కారణంగా ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నట్టు కనిపించింది. చెట్లు నేలకూలాయి, విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి... కార్లు బోల్తా పడ్డాయి.
PowerOutage.us వెబ్‌సైట్ ప్రకారం, ఐదు రాష్ట్రాల్లో దాదాపు 1,40,000 మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణ నమూనాలు, జల చక్రం లయ దెబ్బదింటోందని, దీనివల్ల తరచుగా తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత సంవత్సరం యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశం అనేక టోర్నడోలు మరియు విధ్వంసకరమైన హరికేన్‌ల తాకిడికి గురైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com