Israel-Hamas War: ఇజ్రాయెల్ బాంబుల వర్షం

గాజా స్ట్రిప్‌పై బాంబుదాడులను ఇజ్రాయెల్ మరింత ఉద్ధృతం చేసింది. గాజాకు ఇంటర్నెట్, సమాచార సంబంధాలను..తెంచివేసింది. ఫలితంగా ఇప్పటికే దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నగాజాలోని 23లక్షల ప్రజలు పరస్పర సమాచారం ఇచ్చిపుచ్చుకోలేని పరిస్థితి తలెత్తింది. హమాస్‌ను ఏరిపారవేసేంత దగ్గరగా తమ సైనిక చర్య చేరుకుందని ఇజ్రాయెల్ సైన్యం సంకేతాలు ఇచ్చింది. గత రాత్రి గాజా వైమానిక దాడులు, బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. బాంబు దాడుల కారణంగా ఇంటర్నెట్, సెల్యూలార్, ల్యాండ్‌లైన్ సేవలకు పూర్తి ఆటంకం కలిగింది. అయితే దీనికి వైమానిక దాడులు కారణమా లేక ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న భూతల దాడులా అనేదితెలియలేదు. కొన్ని శాటిలైట్ ఫోన్లు మాత్రం నిరంతరం పనిచేస్తున్నాయి. ఇజ్రాయెల్ అష్టదిగ్భంధనతో వారం క్రితమే గాజా పట్టీకి విద్యుత్ నిలిచిపోయి అంధకారం రాజ్యమేలుతోంది. దాడుల్లో ఇళ్లు ధ్వంసమై, తాగడానికి నీరు, తినడానికి తిండిలేక గాజాలోని పాలస్తీనా ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు.

సమాచార సంబంధాలు కూడా తెగిపోవడంతో..గాజాలోని తమ బంధువులు ఏమయ్యారో తెలుసుకునే అవకాశంకూడా పోయిందని గాజాకు అవతల ఉన్న పాలస్తీనా వాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంటర్నెట్, ఫోన్ లైన్లు దెబ్బతినడం వల్ల ఆసుపత్రులు, ఇతర సహాయ కార్యక్రమాలు చేయడం సాధ్యపడడంలేదని ఐక్యరాజ్యసమితి మానవతా విభాగం సమన్వయకర్త లిన్ హాస్టింగ్ఎ క్స్‌లో తెలిపారు. వైద్య బృందాలు, ప్రజలను ఫోన్‌లో సంప్రదించడం సాధ్యపడడంలేదని రెడ్ క్రిసెంట్ తెలిపింది. బాంబు దాడుల శబ్దాలు వచ్చిన దిశగా వెళ్లి క్షతగాత్రులకు తాము సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది.
మరోవైపు గాజాపై తమ పదాతిదళాలు దాడులు ఉద్ధృతం చేశాయని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగరీ వివరించారు. తమ ఉద్దేశం నెరవేరే దిశగా విజవంతమైనట్లు ఆయన చెప్పారు. తమ వైమానిక దాడులు హమాస్ సభ్యులను, వారి మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించారు. పౌరుల మధ్య నుంచి హమాస్ దాడులు చేయడం ప్రజల ప్రాణాలకే ముప్పని హెచ్చరించారు. సరిహద్దుల వద్ద ఉన్న ట్యాంకుదళాలు, ఇజ్రాయెల్ దళాలతో రాత్రంతా తీవ్ర పోరాటం జరిగిందని హమాస్ మీడియా సెంటర్ తెలిపింది. సుమారు వంద ఫైటర్ జెట్స్‌తో అటాక్ చేశామని ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషనన్స్ బ్రిగేడర్ జనరల్ గిలాడ్ కీనన్ తెలిపారు.

అక్టోబరు 7 నుంచి జరుగుతున్న దాడుల్లో గాజాలో మృతుల సంఖ్య 7300కు చేరిందని, వారిలో 60శాతం మంది మైనర్లు, మహిళలే ఉన్నారని.. పాలస్తీనా ఆరోగ్యశాఖ తెలిపింది. అక్టోబరు 7న హమాస్ చేసిన మెరుపు దాడుల్లో.. 1400 మంది చనిపోయినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. దాదాపు 229 మంది హమాస్ వద్ద బందీలుగా ఉన్నట్లు చెబుతోంది. వారిని విడిపించేంత వరకూ తమ పోరాటం ఆగదని తెలిపింది. మరోవైపు హమాస్ రాకెట్ దాడులతో ఇజ్రాయెల్ నగరం అస్కెలోన్‌లో రెండుసార్లు సైరన్లు మోగాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com