Nasa: నాసా మానవసహిత జాబిల్లి యాత్ర వాయిదా

చంద్రుడిపైకి మనుషుల్ని పంపే జాబిల్లి యాత్రను నాసా మరికొన్నేళ్ల పాటు వాయిదా వేసింది. 2024 ఏడాది చివరలో ఆర్టెమిస్-2 పేరుతో మానవసహిత జాబిల్లి యాత్ర నిర్వహించతలపెట్టిన నాసా ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. పెరిగ్రీన్ ల్యాండర్ ప్రయోగం విఫలం కావడంతో నాసా తాజా నిర్ణయం తీసుకుంది. దాంతో మానవసహిత జాబిల్లి యాత్ర 2025లో జరిగే అవకాశం ఉంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపేందుకు తాజాగా అమెరికా చేసిన ప్రయోగం విఫలమైంది. ఇంధన లీకేజీ కారణంగా పెరిగ్రీన్ ప్రయోగాన్ని విరమించుకోవాల్సి వచ్చింది.
అర్టెమిస్-2 మిషన్ ద్వారా ఈ ఏడాది చివరలో చంద్రుడి కక్ష్యలో తిరిగేందుకు నలుగురు వ్యోమగాములను పంపాలని నాసా భావించింది. ఆ నలుగురు వ్యోమగాములను జాబిల్లి ఉపరితలానికి 9 వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి పంపించాలనుకుంది. కానీ పెరిగ్రీన్ ప్రయోగం విఫలం కావడంతో మానవసహిత జాబిల్లి యాత్రను వచ్చే ఏడాది సెప్టెంబర్‌కు వాయిదా వేసినట్లు నాసా తెలిపింది. అదేవిధంగా చంద్రుడిపైకి మనుషులను పంపే ఆర్టెమిస్-3 యాత్ర కూడా 2026కు వాయిదా పడింది. అర్టెమిస్-3 ద్వారా ఒక మహిళ సహా నలుగురు వ్యోమగాములను చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపాలని నాసా సన్నాహాలు చేస్తోంది.
పెరిగ్రీన్ వైఫల్యం అంటే ..
ప్రైవేటు సంస్థ ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన పెరిగ్రీన్ ల్యాండర్‌ను నాసా ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ నెల 8న వల్కన్ రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఏడు గంటల తర్వాత మిషన్‌లో ఇబ్బంది తలెత్తింది. ఇంధనం లీకేజీ వల్ల సమస్య ఎదురైనట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు ఆ ప్రయోగాన్ని విరమించుకున్నారు. తాజాగా విఫలమైన పెరిగ్రిన్ ల్యాండర్‌లో జాబిల్లి ఉపరితలాన్ని శోధించే అనేక సైన్స్ పరికరాలున్నాయి. ఆర్టెమిస్ యాత్రలో వెళ్లే వ్యోమగాములు దిగాల్సిన ప్రదేశాన్ని నిర్దేశించడం కూడా దీని ప్రయోగ లక్ష్యాల్లో ఒకటి. ఈ ప్రయోగం విఫలం కావడం వల్లే నాసా తదుపరి యాత్రలను ఆలస్యం చేసుకోవాల్సి వచ్చింది. వచ్చే నెలలో మరో ప్రైవేటు కంపెనీ అభివృద్ధి చేసిన ల్యాండర్‌ను నాసా ప్రయోగించనుంది.
1969లో అపోలో 11 రాకెట్‌లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్, మైఖేల్ కాలిన్స్ జాబిల్లికిపైకి వెళ్లారు. చంద్రుడిపై అడుగుపెట్టారు. ఆ తర్వాత కూడా 1972 వరకు కూడా నాసా ఆరుసార్లు మానవసహిత జాబిల్లి యాత్రలు నిర్వహించింది. పలుమార్లు మెషిన్ ల్యాండర్లను ప్రయోగించింది. ఇప్పుడు ఆర్టెమిస్-2 ప్రయోగంతో మరో నలుగురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నది. అయితే ఈ ప్రయోగం విఫలం కావడంతో తదుపరి యాత్రలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కాగా, వచ్చే నెలలో మరో ప్రైవేటు కంపెనీ అభివృద్ధి చేసిన లూనార్ ల్యాండర్‌ను నాసా ప్రయోగించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com