20 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీలనే మళ్లీ వినిపిస్తున్న తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న తాలిబన్లు.. 20 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీలనే మళ్లీ మళ్లీ వినిపిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏ దేశానికి ప్రమాదం తలెత్తబోదని చెబుతున్నారు తాలిబన్లు. ఆఫ్ఘన్ నేల నుంచి పొరుగుదేశాలకు సైతం ముప్పు ఉండబోదని చెప్పారు. దేశం విడిచి వెళ్లిపోతున్న ఆఫ్ఘన్లకు కూడా భరోసా కల్పిస్తామని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు.
కాబూల్‌లోని అన్ని దేశాల దౌత్య కార్యాలయాలకు భద్రత కల్పిస్తామన్నారు తాలిబన్లు. మీడియా సంస్థలు కూడా ఎప్పటిలాగే పనిచేయొచ్చని చెబుతూనే.. మూడు విషయాలు తప్పకుండా పాటించాలని కండీషన్లు పెట్టారు. ఇస్లామిక్ విలువలకు విరుద్ధంగా, దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రసారాలు చేయకూడదని సూచనలు చేశారు.
ఆఫ్ఘన్ ప్రజలకు రక్షణ, హక్కులు కల్పిస్తామని చెబుతున్నప్పటికీ.. తాలిబన్ల మాటలను విశ్వసించడం లేదు ఆఫ్ఘన్లు. ముఖ్యంగా మహిళలకు స్వేచ్ఛనిచ్చే ఉద్దేశమే తాలిబన్లకు లేనట్టు కనిపిస్తోంది. మహిళలకు ఓటు హక్కు కల్పిస్తారా అని మీడియా ప్రశ్నించగానే తాలిబన్లు నవ్వుకున్నారు.
దీన్నిబట్టి.. ఆఫ్ఘన్‌లో ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతుందనే అర్ధం వచ్చేలా ప్రవర్తించారు తాలిబన్లు. 1996లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు.. మహిళల పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరించారు. చదువుకోవడం, ఉద్యోగాలు చేయడాన్ని నిషేధించారు.
పురుషుడి తోడు లేకుండా గడప దాటవద్దని హుకుం జారీచేశారు. ముఖం నుంచి పాదం వరకూ బుర్ఖాతో కవర్ చేసుకోవాలని ఆంక్షలు విధించారు. వీటిని ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు విధించారు. ఇప్పుడు మళ్లీ అదే అరాచకం కొనసాగుతుందని తాలిబన్లు చెప్పకనే చెప్పారు.
ఆఫ్ఘనిస్తాన్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ప్రపంచానికి ముప్పుగా పరిణమించే ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలన్నీ కలిసి ఎదుర్కోవాలన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్గనిస్తాన్ మరోసారి వేదిక కాకుండా, ఉగ్ర సంస్థలు దాన్నొక సురక్షిత స్థావరంగా చేసుకునే అవకాశం ఇవ్వకుండా అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com