TRUMP: ట్రంప్‌కు పెరుగుతున్న మద్దతు

TRUMP: ట్రంప్‌కు పెరుగుతున్న మద్దతు
కాల్పులు జరిగిన తర్వాత అనూహ్యంగా పెరిగిన మద్దతు... చెవికి తెల్లటి బ్యాండేజీలతో మద్దతు...

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటన జరిగిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు మద్దతు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల రిపబ్లికన్‌ పార్టీ జాతీయ సదస్సులో పాల్గొన్న రిపబ్లికన్లు.. వినూత్న రీతిలో ఆయనకు మద్దతు తెలిపారు. తమ కుడి చెవికి తెల్లటి బ్యాండేజీలను కట్టుకుని సంఘీభావం తెలియజేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ పేరుకు ఇప్పటికే ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో ఇటీవల జరిగిన జాతీయ సదస్సుకు ట్రంప్‌ హాజరయ్యారు. అక్కడికి విచ్చేసిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. అప్పుడు చెవికి బ్యాండేజీతో కనిపించారు. అదే సమయంలో అక్కడున్న చాలా మంది చెవులకు తెల్ల బ్యాండేజీ కట్టుకుని మద్దతు తెలియజేశారు.

పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన కుడి చెవికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ట్రంప్‌నకు విజయావకాశాలు భారీగా పెరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రజల్లో మద్దతు ఒక్కసారిగా 8 శాతం పెరిగినట్లు పేర్కొన్నాయి. ట్రంప్‌ అధ్యక్షుడిగా గెలిచేందుకు 70శాతం అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఈ క్రమంలోనే తాజాగా చెవికి బ్యాండేజీలతో ట్రంప్‌నకు మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌(Trump)పై కాల్పుల కేసులో ఎఫ్‌బీఐ చేతికి కీలక ఆధారం లభించింది. నిందితుడు థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ ఈ ఘటన కంటే కొన్నాళ్ల ముందే ఏదో పెద్దది జరగబోతున్నట్లు నర్మగర్భ పోస్టు చేశాడు. ఎఫ్‌బీఐ అధికారులు సెనెటర్లకు ఇచ్చిన వివరణలో ఈ విషయం వెల్లడైంది. నిందితుడు గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘స్టీమ్‌’లో ‘జులై 13న నా తొలి అడుగు. అది ఆవిష్కృతమవుతున్నప్పుడు వీక్షించండి’ అని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఫాక్స్ న్యూస్‌ పేర్కొంది.

లక్షల మంది స్టీమ్‌ వేదికగా గేమ్స్‌ను కొనుగోలు చేయడం, చర్చించుకోవడం వంటివి చేస్తుంటారు. దర్యాప్తు బృందం క్రూక్స్‌ వినియోగించే ఫోన్లు, ఇతర టెక్‌ పరికరాలు, ల్యాప్‌టాప్‌లను పూర్తిగా విశ్లేషిస్తోంది. జులైలో అతడు బైడెన్‌, ట్రంప్‌నకు సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో వెతికినట్లు ల్యాప్‌టాప్‌ విశ్లేషణలో వెల్లడైంది. డెమోక్రాట్ల నేషనల్‌ కన్వెన్షన్‌ సమాచారం.. జులై 13న ట్రంప్‌ ర్యాలీ వివరాలు వాటిల్లో ఉన్నట్లు తేలింది.

Tags

Next Story