Russia : గ్యాస్ స్టేషనులో పేలుడు…12మంది మృతి

రష్యా దక్షిణ ప్రాంతంలోని డాగేస్తాన్‌లోని ఓ గ్యాస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను రష్యా అధికారులు దృవీకరించారు. డాగేస్తాన్ రాజధాని మఖచ్కలలో ఉన్న ఓ ఫిల్లింగ్ స్టేషన్‌లో రష్యా కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
కాస్పియన్ సముద్రం ఒడ్డున ఉన్న మఖచ్కల నగరంలో హైవే పక్కన ఉన్న ఓ కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో ముందుగా మంటలు చెలరేగాయి. కారు పార్క్ చేసిన ప్రాంతంలో వంటలు ప్రారంభమై, పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్‌కు వ్యాపించాయి. దీంతో పెద్దఎత్తున పేలుడు సంభవించింది. తీవ్రత ఎక్కువగా ఉండడంతో మంటలు పరిసర ప్రాంతాలకు సైతం వ్యాపించాయి. 600 చదరపు మీటర్ల మేర విస్తరించిన మంటలను ఆపడానికి అగ్నిమాపక సిబ్బంది మొత్తం 260 ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టారు. మూడున్నర గంటల కంటే ఎక్కువ సమయం శ్రమించాక మంటలు అదుపులోకి వచ్చాయి. ఒక భవనం నుంచి మంటలు ఎగసిపడుతున్నట్టు తర్వాత భారీ పేలుడు సంభవించినట్టు టెలిగ్రామ్ లో ఒక వీడియో వైరల్ అయింది.
ఈ అగ్ని ప్రమాదంలో చాలా కార్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 60కి పైగా గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో 13 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిని మాస్కోకు తరలించేందుకు.. ప్రత్యేక హెలికాఫ్టర్లను ఉపయోగించారు అధికారులు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com