Israel-Hamas War: భీకరంగా మారుతోన్న యుద్ధం

Israel-Hamas War: భీకరంగా మారుతోన్న  యుద్ధం
ఇరువైపుల మరణాల సంఖ్య 10వేలు పైమాటే

ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య జరుగుతోన్న యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతోంది. ఈ భీకర పోరులో అభంశుభం తెలియని చిన్నారులు బలవుతుండటం యావత్‌ ప్రపంచాన్ని కలచివేస్తోంది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు హఠాత్తుగా దాడి చేసి.. భారీ ప్రాణ నష్టాన్ని కలిగించారు. అంతేకాదు కొంతమందిని బందీలుగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తమపై దాడి చేసిన హమాస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ చేస్తోన్న ప్రతిదాడుల్లో నిత్యం వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. యుద్ధం మొదలైన పక్షం రోజుల్లోనే ఇరువైపుల మరణాల సంఖ్య 10వేలు దాటినట్లు అంచనాలు ఉన్నాయి.

అక్టోబర్ 7న తమపై జరిగిన దాడుల్లో ఇబ్రహీం బియారీ కీలకపాత్ర పోషించారని ఇజ్రాయెల్ చెబుతోంది. దీంతో ఇబ్రహీం బియారీని అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లతో విరుచుకుపడింది. బియారీ ఉంటున్న ప్రాంతంలో వైమానిక దాడులు చేసింది. అయితే బియారీని అంతమెందించడం కోసం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులు దగ్గరలో ఉన్న శరణార్థుల శిబిరాన్ని తాకాయి. దీంతో 50 మంది అమాయకులైన సాధారణ పాలస్తీనియన్ ప్రజలు కూడా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారికి చికిత్స చేసేందుకు వైద్యులు క‌ృషి చేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో ఆ ప్రాంతం పూర్తిగా నాశనమైంది. భూగర్భ మౌలిక సదుపాయాలు కూలిపోయాయి. దీంతో ఆ ప్రాంత నివాసులను వారి భద్రత కోసం దక్షిణాది ప్రాంతానికి వెళ్లాని ఐడీఎఫ్ పిలుపునిచ్చింది.


గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి క్యాంపై ఇజ్రాయెల్ నిన్న జరిపిన వైమానిక దాడిలో ప్రముఖ ఇంగ్లిష్ న్యూస్ చానల్ ‘అల్ జజీరా’ ఉద్యోగి మొహమ్మద్ అబు అల్ కుమ్సాన్‌ కుటుంబ సభ్యులు 19 మంది మరణించారు. ఈ విషయాన్ని అల్ జజీరా ప్రకటించింది. ఈ ఘటనపై అల్ జజీరా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంకితభావం కలిసిన తమ ఎస్ఎన్‌జీ ఇంజినీర్ అబ్దుల్ అల్ కుమ్సాన్ కుటుంబ సభ్యులు 19 మంది మరణానికి కారణమైన ఘోరమైన, విచక్షణ రహిత ఇజ్రాయెల్ బాంబు దాడిని ఖండిస్తున్నట్టు పేర్కొంది. ‘జబాలియా మారణహోమం’లో కుమ్సాన్ తండ్రి, ఇద్దరు తోబుట్టువులు, 8 మంది మేనల్లుళ్లు, మేనకోడళ్లు, ఆయన అన్నా, వదిన, వారి నలుగురు పిల్లలు, ఆయన మరో వదిన, మామ మరణించినట్టు వివరించింది.


ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్).. కీలకమైన హమాస్ కమాండ్ అక్కడ దాగి ఉండడం వల్లే జబాలియా శరణార్థి శిబిరంపై దాడి చేసినట్టు వివరణ ఇచ్చింది. హమాస్ కమాండర్ బియారీ సహా మరో 12 మంది ఫైటర్లు మరణించినట్టు తెలిపింది. మరోవైపు, జబాలియాలో 400 మంది వరకు మరణించినట్టు హమాస్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story