Pakistan: పాక్ లో ఉగ్రవాదుల ఘాతుకం, బస్సులోంచి దించి మరీ

Pakistan: పాక్ లో ఉగ్రవాదుల  ఘాతుకం, బస్సులోంచి దించి మరీ
X
పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన వారే లక్ష్యంగా బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ దుశ్చర్య

పాకిస్థాన్‌లో బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ)రెచ్చిపోయింది. ‘ఆపరేషన్‌ హెరాఫ్‌’ పేరుతో బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లో పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. సైనిక స్థావరాలు, పోలీస్‌ స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్నది. ఈ క్రమంలో రహదారులను ఆధీనంలోకి తీసుకొని సాధారణ ప్రయాణికులనూ హతమార్చింది. దాడుల్లో 23 మంది ప్రజలు సహా 38 మంది మరణించారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ నజీబ్‌ కాకేర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం ముసఖైల్‌ జిల్లాలోని రరాషామ్‌ ప్రాంతంలో పంజాబ్‌ – బలూచిస్థాన్‌ రహదారిని సాయుధులు అధీనంలోకి తీసుకున్నారు. బస్సులు, వ్యాన్లు, ట్రక్కులను కలిపి మొత్తం 22 వాహనాలను నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దించేశారు. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి, పంజాబ్‌ ప్రావిన్స్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వాకు చెందిన వారిని గుర్తించి కాల్పులు జరిపారు. కాల్పుల్లో 23 మంది మృతి చెందినట్టు గుర్తించారు. మృతుల్లో నలుగురు సైనికులు కాగా, మిగతా వారు సాధారణ ప్రజలు. కలత్‌ జిల్లాలో బీఎల్‌ఏ దాడుల్లో మరో 11 మంది మరణించగా, వీరిలో నలుగురు సాధారణ పౌరులని ఎస్సీ దష్టి తెలిపారు. ఆదివారం రాత్రి మస్తంగ్‌, కలత్‌, పస్ని, సున్‌స్టార్‌ పోలీస్‌ స్టేషన్లపై బీఎల్‌ఏ కాల్పులు జరిపింది. సిబి, పంజగర్‌, తర్బత్‌ బేలా, క్వెట్టాలో గ్రెనేడ్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో నలుగురు భద్రతా సిబ్బంది మరణించారు.

అయితే పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన ప్రయాణికులే లక్ష్యంగా ముష్కరులు ఈ దాడి చేసినట్లు డాన్ మీడియా పేర్కొంది. పాక్ పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ ఉగ్రదాడిని బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్టీ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ ముష్కర దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబ సభ్యులకు బలూచిస్తాన్ సీఎం హామీ ఇచ్చారు.

బేలాలోని పాక్‌ ఆర్మీ క్యాంపుపై పెద్ద ఎత్తున పేలుళ్లు జరిపి 40 మంది పాక్‌ సైనికులను హతమార్చినట్టు బీఎల్‌ఏ ప్రకటించింది. ఆర్మీ స్థావరంలోని చాలా భాగాన్ని ఆధీనంలోకి తీసుకున్నట్టు వెల్లడించింది. తమ దాడుల్లో 102 మంది పాకిస్థానీ సైనికులు మరణించిపేర్కొంది. కాగా, 14 మంది తమ సైనికులు మరణించారని, 21 మంది ఉగ్రవాదులను హతమార్చామని పాక్‌ ఆర్మీ తెలిపింది.

Next Story