Boat Catches Fire: ఘోర ప్రమాదం.. 50 మంది మృతి

మధ్య ఆఫ్రికా దేశమైన కాంగో లో ఘోర ప్రమాదం సంభవించింది. మబండకా పట్టణం సమీపంలో నదిలో ఓ పడవ మంటల్లో చిక్కుకుంది ఈ ఘటనలో దాదాపు 50 మంది మరణించారు. వందలాది మంది గల్లంతైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.
మంగళవారం రాత్రి దాదాపు 400 మంది ప్రయాణికులతో కూడిన పడవ (చెక్క ఓడ) కాంగో నది మీదుగా మతాంకుము ఓడరేవు నుంచి బోలోంబా ప్రాంతానికి బయల్దేరింది. పడవ మబండకా పట్టణం సమీపంలోకి రాగానే మంటల్లో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు నదిలోకి దూకేశారు. ఈతరాక నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ 50 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. వందలాది మంది గల్లంతైనట్లు పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న రెడ్ క్రాస్, ప్రాంతీయ అధికారులు గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చేపట్టారు. దాదాపు 100 మందిని రక్షించి మబండకా టౌన్ హాల్‌లోని అధునాతన ఆశ్రయానికి తరలించారు. వారిలో చాలా మందికి కాలిన గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఓడలో ఎవరో వంట చేస్తున్న క్రమంలో మంటలు వ్యాపించినట్లు పేర్కొన్నారు.
కాగా, మధ్య ఆఫ్రికా దేశంలో పడవ ప్రమాదాలు సర్వసాధారణమే. గతేడాది డిసెంబర్‌లో ఈశాన్య కాంగోలోని ఓ నదిలో ఫెర్రీ బోల్తా పడిన ఘటనలో 38 మంది మరణించారు. ఇక అక్టోబర్‌లో తూర్పు డీఆర్‌సీలోని కివు సరస్సులో పడవ బోల్తా పడి ఏకంగా 78 మంది ప్రాణాలు కోల్పోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com