Gaza: ఇజ్రాయెల్ దాడి.. భారతీయుడి మృతి
దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికా, ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు . హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలోని రఫా నగరంపై జరిగిన దాడిలో ఐక్యరాజ్య సమితిలో పనిచేసే ఓ భారతీయుడు మృతిచెందారు. ఆయన ఐక్యరాజ్య సమితితో కలిసి గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిసింది.
యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ (డీఎస్ఎస్) విభాగంలో పనిచేస్తున్న ఆ వ్యక్తి తన వాహనంలో రఫాలోని యూరోపియన్ ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో దాడి జరిగింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఆయనతో ఉన్న మరో డీఎస్ఎస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వ్యక్తి భారత్‌కు చెందిన మాజీ సైనికుడని విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ, ఆయన వివరాలను మాత్రం వెల్లడించలేదు.
కాగా, ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రెస్ స్పందించారు. ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితికి చెందిన డీఎస్‌ఎస్ విభాగంలోని సభ్యుడు చనిపోవడం చాలా బాధాకరం అన్నారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రఫాలోని యూరోపియన్ హాస్పిటల్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. గాజాలో ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితికి చెందిన 190 మందికిపైగా సిబ్బంది మృతిచెందారు. మానవతావాదంతో సహాయం చేసే కార్యకర్తలకు తప్పనిసరిగా రక్షణ కల్పించాలన్నారు. ఐరాస సిబ్బందిపై జరిగిన దాడులన్నింటినీ ఖండిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని, బందీలందరినీ విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com