ఆస్ట్రేలియాలో పెళ్లి బస్సు బోల్తా 10 మంది మృతి

ఆస్ట్రేలియాలో పొగమంచు కారణంగా ఒక పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పది మంది మరణించగా, మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 40 మంది పెళ్లి వాళ్ళతో తిరిగి వస్తున్న బస్సు రాత్రిపూట హంటర్ వ్యాలీ వైన్ కంట్రీ లో తిరగబడింది. ప్రమాదంలో గాయపడిన వారిని హెలికాప్టర్ మరియు రోడ్డు మార్గాల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. 40 మంది ప్రయాణికులు ఉన్న ఈ బస్సులో 18 మందికి ఎటువంటి గాయాలు తగలలేదు. బస్సు డ్రైవర్ ని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆస్ట్రేలియాలో అత్యంత పురాతనమైన వైన్ తయారీ కేంద్రాలలో హ్యాంటర్ వ్యాలీ కూడా ఒకటి. అద్భుతమైన సహజ సౌందర్యం గల ఈ ప్రాంతానికి సందర్శకులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సూర్యోదయాన్ని చూడటానికి, వైన్ కాంపిటేషన్ లో పాల్గొనటానికి సందర్శకులు క్యూ కడతారు. హాలిడే రిసార్ట్ గా, మ్యారేజ్ డేస్టినేషన్ గా ఉన్న ఈ ప్రాంతంలో పొగ మంచు కారణంగా ఆదివారం రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్పెషల్ ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

