పార్లమెంటులో ఉద్యోగినిపై అత్యాచారం.. క్షమాపణలు చెప్పిన ప్రధాని!

ఆస్ట్రేలియాలో జరిగిన ఘటన చూస్తే మహిళకు ఎక్కడా రక్షణ లేదని తేలిపోయింది. సాక్షాత్తు ఆస్ట్రేలియా పార్లమెంటులో ఓ ఉద్యోగినిపై అత్యాచారం చేశారు. అది కూడా ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఆఫీసులోనే. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇన్నాళ్లకు నోరు విప్పింది ఆ మహిళ. జరిగిన దానిపై విచారం వ్యక్తం చేసిన ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్.. ఉద్యోగినికి క్షమాపణలు చెప్పారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చి.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.
2019 మార్చిలో ఆస్ట్రేలియా పార్లమెంటులోని రక్షణమంత్రి లిండా రెనాల్డ్ ఆఫీసులో తోటి ఉద్యోగే అత్యాచారం చేశాడు. సమావేశం ఉందని పిలిచిన సీనియర్ సిబ్బంది ఒకరు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. జరిగిన ఘోరంపై అదే ఏడాది ఏప్రిల్‌లో పోలీసులకు చెప్పింది బాధితురాలు. కాకపోతే, తన కెరీర్‌ను దెబ్బతీస్తారని భయపడి అధికారికంగా ఫిర్యాదు చేయలేదని చెప్పింది.
మహిళ వ్యాఖ్యలపై రక్షణమంత్రి రెనాల్డ్ కూడా స్పందించారు. అత్యాచారంపై పోలీసులకు చెప్పిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే కేసు పెట్టకుండా ఎవరూ ఒత్తిడి చేయలేదని మహిళే స్వయంగా చెప్పారని అన్నారు.
ఘటన గురించి తెలియగానే ప్రధాని స్కాట్ మారిసన్.. బాధిత మహిళకు క్షమాపణలు తెలియజేశారు. ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సింది కాదని, పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. ఘటనపై తప్పకుండా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మారిసన్ హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com