Australia to provide package to Ukraine : ఉక్రెయిన్ కు ఆస్ట్రేలియా ఆర్థిక సాయం

రష్యా యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆస్ట్రేలియా ఉక్రెయిన్ కు ఏకంగా 74 మిలియన్ల యుఎస్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.
రష్యా దాడి నేపథ్యంలో ఉక్రయిన్ ను రక్షించేందుకు ఆస్ట్రేలియ ప్రభుత్వం 70 సైనిక వాహనాలతో సహా మరో 74 మిలియన్ల యుఎస్ డాలర్లు ఆర్థిక సాయం అందించనున్నట్టు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని అల్బనేజ్ ప్రకటించారు. ఇందులో భాగంగా 28M113 సాయుధ వాహనాలు, 14 ప్రత్యేక ఆపరేషన్ వాహనాలు, 28 మీడియం ట్రక్కుల తో పాటు 14 ట్రైలర్లను కూడా అందజేయనున్నారు. రష్యా యుద్ధ చర్యలను ఖండించిన ఆస్ట్రేలియా ప్రధాని, ఉక్రెయిన్ విజయం సాధించడానికి ఎటువంటి సహాయం చేయడానికి అయినా సిద్ధంగా ఉందని చెప్పారు. అంతేకాదు ఆస్ట్రేలియా తన వాణిజ్య అవసరాలకోసం ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ను మరో 12 నెలల పాటు పొడిగించనున్నట్టు ప్రకటించారు. వీటితోపాటు 790 మిలియన్ ఆస్ట్రేలియా కరెన్సీ ని కూడా ఇవ్వనున్నారు.
మరోవైపు ప్రిగోజిన్ నాయకత్వంలోని వాగ్నర్ సైన్యం తిరుగుబాటుతో రష్యా కష్టకాలంలో పడింది. ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ యుద్ధం వద్దు అని పిలుపునిచ్చినప్పుడు రష్యా అసలు ఖాతారు చేయలేదు. ఊహించని విధంగా ఉక్రెయిన్‌పై దాడి మొదలు పెట్టింది. ఇదంతా తమను తాము రక్షించుకునేందుకు చేస్తున్న ప్రత్యేక సైనిక యుద్ధంగా సమర్థించుకుంది. కానీ ఇప్పుడు తను పెంచి పోషించిన ప్రైవేట్ సైనిక సంస్థ వాగ్నర్ గ్రూప్ ఇచ్చిన ఝలక్‌కి గడగడలాడింది. వాగ్నర్ సైన్యం తిరుగుబాటుతో ఇన్ని రోజులు ఉక్రెయిన్‌లో మోగిన బాంబుల మోతల రీసౌండ్ ఇప్పుడు రష్యాలో వినిపిస్తోంది. మరోవైపు రష్యాలో మొదలైన ఈ అంతర్యుద్ధాన్ని ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. చెడును కోరేవారు అందులో అంతమవుతారని అన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య కొన్ని నెలలుగా యుద్ధం కొనసాగుతుంది. ప్రపంచంలో చాలా దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలుస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com