Australian man: నడిసంద్రం లో 60 రోజులు..

సముద్రంలో ఒంటరిగా ప్రయాణించడమంటేనే సాహసం. అలాంటిది 3 నెలల పాటు ఆహారం, నీరు లేక కడలి మధ్యలో చిక్కుకుపోతే ఆ బాధ వర్ణణాతీతం. ఓ వ్యక్తి తన కుక్కతో పాటు ప్రమాదవశాత్తు ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో చిక్కుకుపోయి ఏకంగా మూడు నెలలు మునుగుతూ లేస్తూ నానా బాధలు పడ్డాడు.. జీవించాడు. కడలి మధ్యలో అతని మనుగడ ఎలా సాగిందో తెలుసుకుందాం రండి
సిడ్నీకి చెందిన టిమ్ షాడోక్ అనే ఓ 54 ఏళ్ల నావికుడు నెలల తరబడి పసిఫిక్ మహా సముద్రంలో ఒంటరిగా గడిపాడు. సముద్రం మధ్యలో తన పడవ చిక్కుకుపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ గుండె ధైర్యంతో కాలాన్ని నెట్టుకొచ్చాడు. పడవలో ఆయనకి తోడుగా ఉన్నది అతని పెంపుడు కుక్క మాత్రమే. పసిఫిక్ సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో మూడు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఓ మెక్సికో ఓడ అటుగా రావడంతో టిమ్ షాడోక్ ఊపిరి పీల్చుకున్నాడు.
తన పెట్ బెలతో కలిసి సొంత బోట్ లో మెక్సికోలోని లా పాజ్ నుంచి ఫ్రాన్స్‌లోని పాలినేషియాకు ఏప్రిల్ నెలలో షాడోక్ బయలుదేరాడు. సుమారు 6 వేల కిలోమీటర్లు ప్రయాణించాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. కొన్ని వారాల తర్వాత మార్గ మధ్యలో తుపాన్ తలెత్తింది. ఓడ పూర్తిగా దెబ్బతిన్నది. లోపల ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు చెడిపోయాయి. దీంతో షాడోక్ ఎవరినీ సంప్రదించే వీలు లేకుండా పోయింది. సముద్రంలో పచ్చి చేపలను తింటూ, వర్షం పడినప్పుడు ఆ నీటిని భద్రపరుచుకుని తాగుతూ కాలం గడిపాడు. రాత్రివేళ ఓడలోని టెంట్‌లో తలదాచుకునేవాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నెలలపాటు సముద్రంలో ఉండిపోయాడు.. దారీ తెన్ను లేకుండా కష్టాలను తట్టుకుంటూ జీవించాడు.
కొంతకాలం తరువాత ఓ మెక్సికన్ ట్యూనా పడవలోఅటుగా వచ్చిన కొంతమంది అతనిని గుర్తించి కాపాడారు. షాడోక్‌ను రక్షించిన ఫోటోలను మెక్సికన్ ట్యూనా పడవ యజమాని విడుదల చేశారు. సముద్రపు ఒడ్డుకు 1900 కిలోమీటర్ల దూరంలో వీరిని గుర్తించినట్లు తెలిపారు. రక్షించిన సమయంలో షాడోక్, అతని శునకం అపాయకర స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు. వెంటనే ఆ పడవలో ఉన్న వారు ఆహారం, నీరు షాడోక్‌కు అందించి ప్రథమ చికిత్స చేశారు. ప్రస్తుతానికి వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com