Kerstin Gartner: : ఆస్ట్రియా పర్వతంపై చలికి గడ్డకట్టి మహిళ మృతి..ప్రియుడే నిందితుడు

Kerstin Gartner: : ఆస్ట్రియా పర్వతంపై చలికి గడ్డకట్టి  మహిళ మృతి..ప్రియుడే నిందితుడు
X
తీవ్ర ప్రతికూల వాతావరణంలో రక్షణ కల్పించకుండా వెళ్లాడని ప్రాసిక్యూటర్ల వాదన

ఆస్ట్రియాలో అత్యంత ఎత్తైన గ్రాస్‌గ్లాక్నర్ పర్వతంపై జరిగిన ఒక విషాద ఘటనలో 33 ఏళ్ల కెర్‌స్టిన్ గర్ట్‌నర్ అనే మహిళ చలికి గడ్డకట్టి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతికి తీవ్ర నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలపై ఆమె ప్రియుడు, అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడు థామస్ ప్లాంబర్గర్‌ (39)పై అధికారులు హత్య కేసు నమోదు చేశారు.

ఈ ఏడాది జనవరిలో కెర్‌స్టిన్, థామస్ ఇద్దరూ గ్రాస్‌గ్లాక్నర్ పర్వతాన్ని అధిరోహించడం ప్రారంభించారు. అనుకున్న సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరడంతో వారు తీవ్ర ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్నారు. మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, పెనుగాలుల ధాటికి కెర్‌స్టిన్ తీవ్రంగా అలసిపోయి, నీరసించిపోయింది. పర్వత శిఖరానికి కేవలం 150 అడుగుల దూరంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం.. తెల్లవారుజామున 2 గంటల సమయంలో థామస్ సహాయం కోసం వెళ్తున్నానని చెప్పి కెర్‌స్టిన్‌ను అక్కడే ఒంటరిగా వదిలి వెళ్లాడు. చలి నుంచి రక్షణ కల్పించేందుకు తన వద్ద ఉన్న ఎమర్జెన్సీ దుప్పట్లు లేదా ఇతర సామగ్రిని కూడా ఆమెకు ఇవ్వలేదని వారు ఆరోపించారు. అంతేకాకుండా, సహాయక బృందాలకు సమాచారం ఇవ్వడంలో గంటల తరబడి ఆలస్యం చేయడమే కాకుండా, తొలి కాల్ తర్వాత తన ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టాడని తెలిపారు.

తీవ్రమైన గాలుల కారణంగా సహాయక బృందాలు మరుసటి రోజు ఉదయానికి కానీ అక్కడికి చేరుకోలేకపోయాయి. అప్పటికే కెర్‌స్టిన్ మరణించింది. ఈ కేసులో థామస్‌పై తీవ్ర నిర్లక్ష్యంతో హత్యకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. నేరం రుజువైతే అతనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, ఇది కేవలం ఒక దురదృష్టకర ప్రమాదమని అతని తరఫు న్యాయవాది వాదిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ 2026 ఫిబ్రవరి 19న జరగనుంది.

Tags

Next Story