Imran Khan : ఇమ్రాన్ ఖాన్ పార్టీపై పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధం!
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నదన్న ఆరోపణలపై మాజీ ప్రధాని ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)పై నిషేధం విధించనున్నట్టు పాకిస్థాన్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. విదేశీ నిధుల కేసు, మే 9 నాటి అల్లర్లు తదితర అంశాలు పీటీఐ నిషేధానికి సాక్ష్యాలుగా పనికి వస్తాయని పేర్కొంది.
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐపై (పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్) త్వరలో నిషేధం విధించనున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. దేశద్రోహానికి, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆధారాలు లభించడంతోనే ఈ చర్య తీసుకోనున్నట్లు సమాచార మంత్రి అత్తావుల్లా తరార్ సోమవారం వెల్లడించారు. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేయడంతోపాటు అల్లర్లకు ప్రేరేపించిందనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని, అందుకే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే నిషేధ చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. పాకిస్థాన్ ప్రభుత్వ ఈ ప్రకటనతో పీటీఐ పార్టీ ప్రతినిధులు భగ్గుమన్నారు. ‘పాకిస్థాన్ జాతీయ, నాలుగు ప్రాంతీయ అసెంబ్లీల్లో మహిళలు, మైనారిటీలకు రిజర్వు చేసిన సీట్లకు పీటీఐకి అర్హత ఉందని సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులిచ్చింది. అదే జరిగితే 109 సీట్లతో జాతీయ అసెంబ్లీలో పీటీఐ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుంది. దీంతో నిరాశకు గురైన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని వెల్లడించింది’ అని ఒక ప్రకటనలో మండిపడ్డారు.
పీటీఐపై నిషేధం విధించనున్నామని ప్రభుత్వం ప్రకటించడంపై హతాశులయ్యామని పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 కింద వ్యక్తులు పార్టీలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను హరించడమేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండు చేసింది. ఈ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది.
మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్.. 1996లో పీటీఐని స్థాపించారు. 2018లో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్‌లో అది కూలిపోయింది. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అదియాలా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com