Bangladesh: బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా

బంగ్లాదేశ్‌లో మరోసారి నిరసనలు చెలరేగాయి. ఈసారి నిరసనకారులు సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి 2 గంటల్లోగా రాజీనామా చేయాలని డిమాండు చేశారు. ఇతర న్యాయమూర్తులూ దిగిపోవాలంటూ కోర్టు వద్దకు శనివారం ర్యాలీ నిర్వహించారు. న్యాయ వ్యవస్థను సంస్కరించాలని డిమాండు చేశారు. దీంతో చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ వెంటనే రాజీనామా చేశారు. కొన్ని గంటల తర్వాత మరో ఐదుగురు న్యాయమూర్తులు వైదొలగారు.
తొలుత న్యాయమూర్తులతో సమావేశానికి బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ పిలుపునిచ్చారు. దీనికి తాత్కాలిక ప్రభుత్వం అనుమతి లేదని, ఆయన దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలతో ఒక్కసారిగా నిరసనలు చెలరేగాయి. విద్యార్థులతోపాటు పలువురు సుప్రీంకోర్టు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. దీంతో న్యాయమూర్తుల సమావేశం రద్దయింది. అక్కడితో శాంతించని ఆందోళనకారులు కోర్టును చుట్టుముట్టారు. చీఫ్ జస్టిస్ 2 గంటల్లో దిగిపోవాలని డిమాండ్లు చేశారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 65 ఏళ్ల ఒబైదుల్ రాజీనామా చేశారు. రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆయన సన్నిహితుడు. దేశంలోని న్యాయమూర్తులందరి క్షేమం కోసం రాజీనామా చేస్తున్నానని ఒబైదుల్ ప్రకటించారు. మరోవైపు సుప్రీంకోర్టుకు సైన్యం భద్రత కల్పించింది. ‘చీఫ్ జస్టిస్ రాజీనామా లేఖ న్యాయ మంత్రిత్వశాఖకు చేరింది. దీనిని అధ్యక్షుడు షహబుద్దీన్‌కు పంపిస్తాం. త్వరలోనే ఆయన నిర్ణయం తీసుకుంటారు. ప్రధాన న్యాయమూర్తి లేఖే మాకు అందింది. మిగిలిన వారి గురించి సమాచారం లేదు’ అని న్యాయశాఖ తాత్కాలిక సలహాదారు (మంత్రికి సమానం) ఆసిఫ్ నజ్రుల్ తెలిపారు. ఢాకా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ మక్సూద్ కమల్, షజలాల్ వర్సిటీ వీసీ ఫరీద్ ఉద్దీన్ అహ్మద్ రాజీనామా చేశారు.
తమపై దాడులను నిరసిస్తూ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమపై, తమ ఆలయాలు, ఇండ్లపై జరుగుతున్న దాడులకు నిరసన తెలిపారు. తామూ బెంగాలీలమే అని, హిందువులకు కూడా బంగ్లాదేశ్‌లో నివసించే హక్కు ఉందని పేర్కొంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. హసీనా రాజీనామా తర్వాత హిందువులపై దాడులు జరిగాయి. ఒక హిందూ స్కూల్ టీచర్, ఇద్దరు కౌన్సిలర్‌లను అల్లరిమూకలు హతమార్చాయి. హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఖండించారు. దాడులు హేయమైనవని, హిందూ, క్రైస్తవ, బౌద్ధ కుటుంబాలకు రక్షణగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com