Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీలో సంక్షోభం..14 మంది సైనిక అధికారుల అరెస్ట్, మేజర్ జనరల్ మిస్సింగ్..

బంగ్లాదేశ్ సైన్యంలో ఏదో జరుగుతోంది. సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఏకంగా 14 మంది కీలక సైనిక అధికారులను అరెస్ట్ చేయడంతో పాటు, మేజర్ జనరల్ అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది. నివేదికల ప్రకారం, అక్టోబర్ 08న అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ICT) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ అరెస్టులు జరిగినట్లు తెలుస్తోంది. సైన్యం, తన సొంత అధికారుల్ని అరెస్ట్ చేసింది. ఢాకా కంటోన్మెంట్ లోని ‘‘లాగ్ ఏరియా’’ లోపల వీరిని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం వారంతా అక్కడ తాత్కాలికంగా నిర్బంధించబడి ఉన్నారు.
అయితే, ఈ చర్యలపై బంగ్లా సైన్యంలో సీనియర్ అధికారులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ అక్టోబర్ లో 24 మంది అధికారులపై ఆదేశాలు జారీ చేసింది. త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ అధికారులపై యుద్ధ నేరాలతో పాటు ఇతర తీవ్రమైన అభియోగాలను ట్రిబ్యునల్ మోపింది.
అరెస్టులకు భయపడిన మేజర్ జనలర్ కబీర్ అహ్మద్ అజ్ఞాతంలోకి వెళ్లారు. మరోవైపు, సైన్యం దీని గురించి మాట్లాడుతూ.. ట్రిబ్యునల్ చట్టపరమైన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు చెబుతోంది. సీనియర్ అధికారి మేజర్ జనరల్ కబీర్ అహ్మద్ అరెస్టుకు ముందే పారిపోవడమో లేక తప్పించుకోవడానికి సాయం పొంది ఉండొచ్చని నివేదికలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఈయన ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. అయితే, కోర్టు ఆదేశాలు సైన్యం నైతికతను ప్రభావితం చేస్తుందని పలువురు సైనిక అధికారులు ఆందోళన చెందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com