Bangladesh: అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షించనున్న బంగ్లాదేశ్..

అదానీకి వరసగా షాక్‌లు ఎదురవుతున్నాయి. . సౌర విద్యుత్తు కాంట్రాక్టులు పొందేందుకు రూ.2,200 కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో అదానీ గ్రూప్‌తో విద్యుత్తు ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్టు ఇప్పటికే కెన్యా ప్రకటించగా, తాజాగా బంగ్లాదేశ్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. అదానీ కంపెనీతో మునుపటి హసీనా ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు ఒప్పందాన్ని సమీక్షించనున్నట్టు తాజాగా తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. విద్యుదుత్పత్తి ఒప్పందాలను సమీక్షించేందుకు లీగల్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని నియమించాలని విద్యుత్తు, ఇంధనం, ఖనిజ వనరుల శాఖపై జాతీయ సమీక్షా కమిటీ సిఫారసు చేసిందని తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. ఈ కమిటీ ప్రస్తుతం ఏడు మేజర్ ఎనర్జీ, పవర్ ప్రాజెక్టులను సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది. వీటిలో అదానీ గ్రూప్ యాజమాన్యంలోని బీఐఎఫ్‌పీసీఎల్ 1234.4 మెగావాట్ల కంపెనీ కూడా ఉన్నట్లు వివరించింది.
పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసుపై దర్యాప్తు జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంలో దాఖలైన పిటిషన్లపై జరుగుతున్న విచారణలో భాగంగా ఈ పిటిషన్‌ను అడ్వకేట్ విశాల్ తివారీ దాఖలు చేశారు. అదానీ గ్రూప్ స్టాక్ ధరల మాయాజాలానికి పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ భారత్‌లో సౌర విద్యుత్తు కాంట్రాక్టులను పొందడం కోసం కొందరు నేతలకు రూ.2,200 కోట్ల మేరకు లంచాలు ఇచ్చినట్లు అమెరికా న్యాయ శాఖ తాజాగా ఆరోపించింది. దీనిపై అమెరికన్ కోర్టు సమన్లు కూడా పంపింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. అన్ని చట్టాలకు అనుగుణంగానే కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని తెలిపింది. విశాల్ తివారీ తాజాగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, అదానీపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని చెప్పారు. వీటిపై భారతీయ వ్యవస్థల చేత దర్యాప్తు చేయించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com