Bangladesh: తాజా ఎన్నికలు బూటకం.. రద్దు చేయాలని కోరిన షేక్ హసీనా...

Bangladesh: తాజా ఎన్నికలు బూటకం.. రద్దు చేయాలని కోరిన షేక్ హసీనా...
X
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తాజా జాతీయ ఎన్నికలను "బూటకం" అని అభివర్ణించారు. విస్తృతమైన అక్రమాలు, చాలా తక్కువమంది ఓటర్లు ఓటింగ్ లో పాల్గొన్నారని ఆరోపించారు. వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా దేశంలో జరిగిన తాజా జాతీయ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిని "హంతకుడు, ఫాసిస్ట్ ముహమ్మద్ యూనస్ ప్రదర్శించిన బూటకపు ఎన్నికలు"గా అభివర్ణించారు. యూనస్ రాజీనామా చేయాలని అన్నారు.

ఎన్నికలకు ప్రతిస్పందనగా విడుదల చేసిన ఒక ప్రకటనలో, హసీనా " ఓటర్లు లేని, రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికలను రద్దు చేయాలని; యూనస్ రాజీనామా చేయాలని; తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని అన్నారు. అదే విధంగా రాజకీయ ఖైదీలతో పాటు ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, మేధావులు మరియు నిపుణులను విడుదల చేయాలని; అవామీ లీగ్ కార్యకలాపాలపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించాలని కోరారు. తటస్థ ప్రభుత్వంలో స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల ఓటింగ్ హక్కులను పునరుద్ధరించాలని" డిమాండ్ చేశారు.

ఈ ఎన్నికలు "ప్రజల ఓటింగ్ హక్కులు, ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని" విస్మరించాయని అన్నారు. "అవామీ లీగ్ లేకుండా, ఓటర్లు లేకుండా" ఏర్పాటు చేయబడిందని ఆమె ఆరోపించారు.

ఫిబ్రవరి 11 సాయంత్రం నుంచే అక్రమాలు ప్రారంభమయ్యాయని, పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకోవడం, కాల్పులు జరపడం, ఓట్లను కొనుగోలు చేయడానికి డబ్బును విస్తృతంగా ఉపయోగించడం, బ్యాలెట్ పత్రాలను ముద్రించడం, ఫలితాల షీట్లపై ఏజెంట్ల సంతకాలను తీసుకోవడం వంటి ఆరోపణలు ఉన్నాయని హసీనా పేర్కొన్నారు. ఫిబ్రవరి 12 ఉదయం నుండి, దేశవ్యాప్తంగా చాలా పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని, రాజధాని మరియు దేశంలోని ఇతర ప్రాంతాలలోని అనేక పోలింగ్ కేంద్రాలు "పూర్తిగా ఓటర్లు లేకుండా పోయాయి" అని ఆమె ఆరోపించారు.

అవామీ లీగ్ లేకుండా ప్రజలు ఈ ఎన్నికలను బహిష్కరించి తిరస్కరించారని రుజువు చేస్తుంది ఈ ఎన్నికల ప్రక్రియ అని ఆమె అన్నారు. "ముఖ్యంగా ఢాకాలో ఓటరు జాబితాలో ఓటర్ల సంఖ్య అసాధారణంగా పెరిగిందని, ఇది చాలా సందేహాస్పదంగా, నమ్మశక్యం కానిదిగా" ఉందని పేర్కొంటూ ఆమె ఓటరు జాబితా సమగ్రతను ప్రశ్నించారు.

Tags

Next Story