Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల డేట్ ఫిక్స్- హసీనా పార్టీ లేకుండానే?
బంగ్లాదేశ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలకు తేదీలు ఖరారయ్యాయి. బంగ్లా 13వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికలను 2026, ఫిబ్రవరి 12 నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీరుద్దీన్ దేశ ప్రజల్ని ఉద్దేశిస్తూ ఈ ప్రకటన చేశారు. స్వేచ్ఛాయుతమైన, ప్రజాస్వామ్యబద్ధమైన ఓటింగ్ నిర్వహించగలమని ప్రపంచానికి నిరూపించేందుకు దేశం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. నకిలీ వార్తలు, పుకార్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజల్ని కోరారు.
సార్వత్రిక ఎన్నికలు, జూలై చార్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు ఓటింగ్ ఫిబ్రవరి 12న ఏకకాలంలో జరుగుతుందని ఎన్నికలక కమిషనర్ తెలిపారు. మొత్తం 300 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ప్రవాస బంగ్లాదేశీయులు రేపటి నుంచి డిసెంబర్ 25 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం, నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 29, 2025 (సోమవారం). నామినేషన్ పత్రాల పరిశీలన డిసెంబర్ 30, 2025 (మంగళవారం) నుండి జనవరి 4, 2026 (ఆదివారం) వరకు జరుగుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జనవరి 20, 2026 (మంగళవారం) వరకు సమయం ఉంటుంది.
ప్రధాని పదవి నుంచి దిగిపోయిన హసీనా
గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ సమయంలో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ఆమె దేశం విడిచి, భారత్‌కు వచ్చేశారు. ఇండియాలోనే ఆశ్రయం పొందుతున్నారు. ఆమె రాజీనామాతో బంగ్లాలో అవామీ లీగ్ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో పాలన కొనసాగిస్తోంది.
మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే కేసులో బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణ శిక్ష విధించింది. దీంతో షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్‌ను కోరుతోంది. ఈ వ్యవహారంపై ఇటీవల భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో హసీనా భారత్‌కు వచ్చారన్నారు. తుది నిర్ణయం ఆమే స్వయంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

