Bangladesh Gang Rape: బంగ్లాదేశ్‌లో గిరిజనులు, బెంగాలీల మధ్య తీవ్ర ఘర్షణలు

బంగ్లాదేశ్‌లో ఓ గిరిజన బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం స్థానికంగా జాతుల మధ్య చిచ్చు రాజేసింది. ఆదివాసీ తెగలకు, వలస వచ్చిన బెంగాలీ వర్గాలకు మధ్య చెలరేగిన తీవ్ర ఘర్షణల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, సైనికులు, పోలీసులు సహా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. భారీగా భద్రతా బలగాలను మోహరించినా హింస అదుపులోకి రాకపోవడంతో ఆగ్నేయ బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది.
భారత్-మయన్మార్ సరిహద్దుల సమీపంలోని చిట్టగాంగ్ కొండ ప్రాంతమైన ఖగ్రాఛారి జిల్లాలో మంగళవారం ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ గిరిజన బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా సామూహిక అత్యాచారానికి గురైంది. అర్ధరాత్రి సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శనివారం నుంచి నిరసనలు ఉద్ధృతం చేసి, టైర్లు కాల్చి, చెట్లను అడ్డంగా వేసి రహదారులను దిగ్బంధం చేశాయి. దీంతో ఆదివారం నాటికి ఈ ఆందోళనలు హింసాత్మక ఘర్షణలుగా మారాయి.
ఖగ్రాఛారి జిల్లా కేంద్రంలో మొదలైన అల్లర్లు క్రమంగా ఇతర ప్రాంతాలకూ వ్యాపించాయి. ఇరు వర్గాల వారు ఒకరి వ్యాపార సముదాయాలపై, ఇళ్లపై మరొకరు దాడులు చేసుకుంటూ నిప్పు పెట్టారు. దీంతో జిల్లా కేంద్రానికి 36 కిలోమీటర్ల దూరంలోని గుయిమారా ప్రాంతంలో పరిస్థితి చేయిదాటింది. అక్కడ జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అహ్సాన్ హబీబ్ మీడియాకు తెలిపారు. మృతదేహాలను ఖగ్రాఛారి సదర్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. మృతులు ఏ వర్గానికి చెందినవారో అధికారులు వెల్లడించలేదు. ఈ ఘర్షణల్లో 13 మంది సైనికులు, ముగ్గురు పోలీసులు కూడా గాయపడినట్లు హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం ఖగ్రాఛారి పట్టణంలో, సమీప ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించింది. సైన్యం, సరిహద్దు భద్రతా దళం (BGB), పోలీసులు గస్తీ కాస్తున్నప్పటికీ, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. అక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొందని స్థానిక జర్నలిస్టులు తెలిపారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ హోం శాఖ, తక్షణమే దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. ప్రజలందరూ సంయమనం పాటించాలని కోరింది. కాగా, బాలికపై అత్యాచారం కేసులో సైన్యం సహాయంతో ఓ బెంగాలీ యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు, కోర్టు ఆదేశాలతో ఆరు రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com