Bangladesh: భూ కేటాయింపుల కుంభకోణంలో షేక్ హసీనాకు ఐదేళ్ల జైలు శిక్ష

Bangladesh:  భూ కేటాయింపుల కుంభకోణంలో షేక్ హసీనాకు ఐదేళ్ల జైలు శిక్ష
X
ఇదే కేసులో మరో 14 మందికి ఐదేళ్ల చొప్పున జైలు విధించిన కోర్టు

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరో అవినీతి కేసులో ఎదురుదెబ్బ తగిలింది. పూర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్టులో భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢాకాలోని ప్రత్యేక కోర్టు ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సోమవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది

ఇదే కేసులో హసీనా సోదరి షేక్ రెహానాకు ఏడేళ్లు, ఆమె మేనకోడలు, బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిఖీకి రెండేళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. ఢాకా స్పెషల్ జడ్జి కోర్టు-4 న్యాయమూర్తి ఎండీ రబియుల్ ఆలం ఈ తీర్పును ప్రకటించారు. నిందితులు ముగ్గురూ కోర్టుకు హాజరు కాలేదు. కేసులో మరో 14 మంది నిందితులకు కూడా తలా ఐదేళ్ల జైలు శిక్ష పడింది. దోషులైన 17 మందికి లక్ష బంగ్లాదేశ్ టాకాల చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.

బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ (ఏసీసీ) ఈ భూ కేటాయింపుల వ్యవహారంపై మొత్తం ఆరు కేసులు దాఖలు చేసింది. కాగా, ఇదే తరహా అవినీతి ఆరోపణలపై గత నవంబర్ 27న కూడా మరో కోర్టు హసీనాకు 21 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అటు, అల్లర్ల సందర్భంగా మానవత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చి వందలాది మరణాలకు కారణమయ్యారన్న కేసులో ఆమెకు మరణశిక్ష విధించడం తెలిసిందే.

తాజా తీర్పుపై షేక్ హసీనా కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. తమపై మోపిన అవినీతి ఆరోపణలన్నీ నిరాధారమైనవని, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని ఓ ప్రకటనలో ఖండించారు. "మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏసీసీని నియంత్రిస్తోంది. పక్షపాత సాక్ష్యాలతో మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారు. కనీసం మా వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదు" అని వారు ఆరోపించారు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ కూడా ఈ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణించింది.

Tags

Next Story