Bangladesh: పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్‌ దోస్తీ .. వీసా నిబంధనల సడలింపు ఇంకా ఎన్నెన్నో

Bangladesh: పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్‌ దోస్తీ .. వీసా నిబంధనల సడలింపు ఇంకా ఎన్నెన్నో
X
ఉగ్రవాదానికి కేంద్రంగా మారేందుకు సిద్ధంగా బంగ్లాదేశ్..

షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌కి చాలా దగ్గరైంది. 1971 విముక్తి ఉద్యమంలో లక్షలాది మంది బెంగాలీలను చంపిన ఉదంతాన్ని మరిచిపోయి, పాక్‌తో స్నేహం చేస్తోంది. నిజానికి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి కారణమైన భారత్‌ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలోని హిందూ మైనారిటీలపై మతోన్మాద మూకలు దాడులకు తెగబడుతున్నాయి. భారత్, అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న అభ్యర్థనను కూడా యూనస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

పాక్-బంగ్లా దోస్త్ మేరా దోస్త్ :

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వంలో జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బీఎన్పీ) నేతలు భారత్‌కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, పాక్‌కి దగ్గరవుతున్నారు. నిజానికి ఆ దేశ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మన్ చిత్రాన్ని ఆ దేశ కరెన్సీ నుంచి తొలగించారు. ఇటీవల ఢాకాలో జరిగిన ఓ సమావేశంలో మహ్మద్ అలీ జిన్నాని తమ జాతిపితగా పొగిడారు. ఇదిలా ఉంటే ఇప్పుడు, బంగ్లాదేశ్ పాక్ జాతీయులకు వీసా నిబంధనల్ని సులువు చేసింది. దీంతో ఎలాంటి తనిఖీలు లేకుండా పాక్ జాతీయులు బంగ్లాదేశ్‌కి రావచ్చు.

మరోవైపు పాక్ నుంచి నేరుగా విమాన సర్వీసుల్ని ప్రారంభించింది. ఇస్లామాబాద్ నుంచి 25,000 టన్నుల చక్కెరని దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. 47 ఏళ్ల తర్వాత ఇరు దేశాలు సముద్ర మార్గాన్ని రీ ఓపెన్ చేశాయి. కరాచీ నుంచి చిట్టగాంగ్‌కి ఇటీవల కార్గో షిప్ వచ్చింది. ఇదే కాకుండా ఎప్పుడూ లేని విధంగా యూనస్ ప్రభుత్వం పాక్ నుంచి 40 టన్నుల ఆర్డీఎక్స్, 2900 హై ఇంటెన్సిటీ ప్రొజెక్టైల్స్, 2000 యూనిట్ల ట్యాంక్ మందుగుండు సామాగ్రి, 40,000 అర్టిలరీ మందుగుండు సామాగ్రిని ఆర్డర్ చేసింది.

భారత్ ఆందోళనలు ఏమిటి..?

షేక్ హసీనా ఉన్నంత కాలం బంగ్లాదేశ్‌ని భారత వ్యతిరేక ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఉక్కుపాదం మోపింది. ఎప్పుడైతే ఆమెని పదవీ నుంచి దించిన తర్వాత యూనస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వంలో జమాతే ఇస్లామి, బీఎన్పీ, షేక్ హసీనాకు వ్యతిరేకంగా అల్లర్లు చేసిన ఇస్లామిక్ ఛత్రశిబిర్ ఉన్నాయి. వీరంతా భారత్‌కి వ్యతిరేకంగా ప్రతీరోజు ఆందోళనలు చేపడుతున్నారు. హిందువులపై దాడుల్లో జమాతే ఇస్లామీ పాత్ర అధికంగా ఉంది.

షేక్ హసీనా కాలంలో బంగ్లాదేశ్ విడిచి వెళ్లిన జమాతే నాయకులు ఒక్కొక్కరిగా దేశం చేరుకుంటున్నారు. దీంతో రానున్న కాలంలో అక్కడ మరింత ఇస్లామిక్ మతోన్మాదం బలపడే అవకాశం ఉంది. దీంతో పాటు పాక్‌కి అనుకూలంగా తీసుకున్న నిర్ణయంతో ఆ దేశం నుంచి బంగ్లాదేశ్‌కి ఉగ్రవాద, రాడికల్ ఇస్లామిక్ నేతలు స్వేచ్ఛగా వచ్చే అవకాశం ఏర్పడింది. దీంతో బంగ్లాలో ఇస్లామిక్ తీవ్రవాదం మరింత బలపడబోతుందనేది సుస్పష్టం.

Tags

Next Story