BBC: ట్రంప్ డాక్యుమెంట‌రీ ఎడిటింగ్‌మిస్టేక్ .. ఇద్ద‌రు బీబీసీ ఉన్న‌తోద్యోగులు రాజీనామా

BBC: ట్రంప్ డాక్యుమెంట‌రీ ఎడిటింగ్‌మిస్టేక్ .. ఇద్ద‌రు బీబీసీ ఉన్న‌తోద్యోగులు రాజీనామా
X
ట్రంప్ ప్రసంగం ఎడిట్‌పై విమర్శలు

బీబీసీలో భారీ కుదుపు చోటుచేసుకుంది. ట్రంప్ వర్గం నుంచి ఎదురైన వ్యతిరేకతతో బీబీసీ డైరెక్టర్ జనరల్, న్యూస్ సీఈవో ఇద్దరూ కూడా తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. దీంతో ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.

బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవి, న్యూస్ సీఈవో డెబోరా టర్నెస్ తమ పదవులకు రాజీనామా చేశారు.డైరెక్టర్ జనరల్ టిమ్ డేవి, న్యూస్ సీఈవో డెబోరా టర్నెస్ ఇద్దరూ కూడా సంస్థను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని బీబీసీ తెలిపింది. టిమ్ డేవి.. బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. 2021, జనవరి 6న ట్రంప్ చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సంస్థకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం చేసుకోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు.

బీబీసీ తన డాక్యుమెంటరీ కోసం ట్రంప్ ప్రసంగాన్ని సవరించింది. ట్రంప్ ప్రసంగాన్ని సవరించడం కారణంగా ప్రజాస్వామ్యాన్ని తప్పుదారి పట్టించేలా ఉందంటూ రిపబ్లికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో నిరసనకారులు బీబీసీపై దాడి కూడా యత్నించే ప్రయత్నించారు. తాజాగా ఐదేళ్ల తర్వాత కీలక పదవుల్లో ఉన్నవారంతా తప్పుకోవాల్సి వచ్చింది. ట్రంప్ ప్రసంగం ఎడిట్ కారణంగా ఇబ్బందులు తలెత్తడంతో ఆదివారం బ్రిటిష్ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవి తన పదవికి రాజీనామా చేశారు.

ఐదు సంవత్సరాలు తర్వాత ఉద్యోగం మానేయాలా వద్దా? అనేది పూర్తిగా తన నిర్ణయం అని టిమ్ డేవి తన సిబ్బందికి రాసిన లేఖలో పేర్కొన్నారు. బీబీసీ బాగానే పని చేస్తోందని.. కానీ కొన్ని తప్పులు జరిగాయని.. డైరెక్టర్ జనరల్‌గా అంతిమ బాధ్యతగా తానే వహిస్తున్నట్లు చెప్పారు. రాబోయే నెలల్లో వచ్చే వారసుడు బోర్డుతో కలిసి పని చేస్తారని వెల్లడించారు.

నేను ప్రేమించే సంస్థ వివాదంలో ఉందని.. బీబీసీకి నష్టం జరగకూడదనే సీఈవో పదవికి రాజీనామా చేస్తున్నట్లు టర్నెస్ తెలిపారు. ఈ వివాదం తనతోనే ఆగిపోతుందన్నారు. ప్రజా జీవితంలో నాయకులు పూర్తిగా జవాబుదారీగా ఉండాలని.. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తప్పులు జరిగినప్పటికీ సంస్థాగతంగా పక్షపాతంతో వ్యవహరిస్తుందని.. ఆరోపణలు పూర్తిగా తప్పని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాజీనామాలపై బీబీసీ చైర్మన్ సమీర్ షా స్పందించారు. ‘‘బీబీసీకి విచారకరమైన రోజు’’గా అభివర్ణించారు. టిమ్ డేవి గత ఐదేళ్లుగా అత్యుత్తమ డైరెక్టర్ జనరల్‌గా పని చేశారంటూ ప్రశంసించారు. అయినా కూడా టిమ్ డేవితో కలిసి పని చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్ తీవ్రంగా ధ్వజమెత్తారు. బీబీసీకి రాజీనామా చేస్తున్న వ్యక్తులు నిజాయితీ లేని వ్యక్తులు అంటూ విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఒక మంచి ప్రసంగాన్ని ఎడిట్ చేసి పట్టుబడ్డారని.. ఇది ప్రజాస్వామ్యానికి ఎంత భయంకరమైన విషయం అంటూ ట్రంప్ రాసుకొచ్చారు.

అసలేం జరిగిందంటే..

బీబీసీ ‘పనోరమా’ పేరుతో ఒక ఎపిసోడ్ వేసింది. అందులో ట్రంప్ ప్రసంగంలోని కొన్ని క్లిప్‌లు వేసింది. అందులో ట్రంప్ చెబుతున్నట్లుగా ‘‘మేము కాపిటల్‌కి నడిచి వెళ్తాము. నేను మీతో ఉంటాను. మేము పోరాడుతాం. మేము నరకంలా పోరాడుతాం’’ అంటూ ట్రంప్ మాట్లాడినట్లుగా ప్రసంగాన్ని ఎడిట్ చేసి ప్రసారం చేశారు. వాస్తవంగా ట్రంప్ ప్రసంగంలోని ఒరిజనల్ ఏంటంటే.. ‘‘మేము కాపిటల్‌కి నడిచి వెళ్లాం. మా ధైర్యవంతులైన సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు, మహిళలను ఉత్సాహపరుస్తాము. వారిలో కొందరిని మనం అంతగా ఉత్సాహపరచబోము.’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రసంగాన్ని బీబీసీ ఎడిట్ చేసి ప్లే చేసింది. దీంతో రిపబ్లికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా ఉందంటూ ట్రంప్ వర్గం ధ్వజమెత్తింది. ఈ నేపథ్యంలో దాదాపు ఐదేళ్ల తర్వాత బీబీసీలో భారీ కుదుపు ఏర్పడి.. కీలక నేతలు రాజీనామా చేయాల్సి వచ్చింది.

Tags

Next Story