China : వర్షాలు, వరదలతో అతలాకుతలం

China : వర్షాలు, వరదలతో  అతలాకుతలం
జలప్రళయానికి 20 మందికి పైగా మృతి

డాక్‌సురి టైఫూన్ కారణంగా చైనాలో శనివారం నుంచి కురిసిన కుండపోత వర్షాలు తెరిపినివ్వగా పోటెత్తిన వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. బీజింగ్‌కు నైరుతి దిశలో ఉన్న చుచౌ నగరాన్ని దశాబ్దకాలంలో ఎన్నుడూలేనంతగా వరద ముంచెత్తింది. దాదాపు ఆరు లక్షల మంది జనాభా ఆ నగరంలో ఉన్నారు. వారిలో లక్షా 34 వేల మంది నిరాశ్రయులయ్యారు. మొత్తంగా 140ఏళ్ల రికార్డును తిరగరాసిన వర్షం ధాటికి చైనా రాజధాని పరిసర ప్రాంతాల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

వరదల్లో ఇంకా అనేక మంది చిక్కుకుపోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ సహాయ బృందాలు.వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. బోట్లు, హైలికాఫ్టర్ల సాయంతో ఇళ్లపైన ఉన్నవారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. వర్షం ఆగినప్పటికీ చుచౌ నగరంలో వరద నీరు తగ్గడానికి మరింత సమయం పడుతుందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ఇప్పటికే నగరంలో తాగునీటి కొరత ఏర్పడింది. భారీ వర్షాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుచౌలో 28 అత్యవసర సహాయ బృందాలు రంగంలోకి దిగాయి.


చైనా వ్యాప్తంగా వరద సహాయ చర్యల కోసం 9వేల మంది సహాయ సిబ్బందిని ప్రభుత్వం పంపింది. హుబే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకుపోయిన బాధితులను చేరేందుకు సహాయ సిబ్బందికి కష్టంగా మారింది. ప్రభుత్వేతర సంస్థలు కూడా వరద సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. ఒక భవనం రెండో అంతస్థులో 8 మంది చిక్కుకుపోయినట్లు గుర్తించిన సహాయ బృందాలు వారిని చేరేందుకు దారిలేక ఇబ్బంది పడ్డాయి. దుప్పట్లను తాడు మాదిరి ఉపయోగించి రక్షించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఒక చిన్నబోటుతో మరో బృందం అక్కడికి చేరుకుని వారిని రక్షించింది. డాక్‌సురి టైఫూన్‌ కారణంగా శనివారం నుంచి చైనా రాజధాని బీజింగ్‌, టియాంజిన్‌, హుబే, తదితర ప్రాంతాల్లో మూడు రోజులు కుంభవృష్టి కురిసింది.

Tags

Read MoreRead Less
Next Story