Mehul Choksi: మెహుల్‌ ఛోక్సీ తమ దేశంలోనే ఉన్నాడన్న బెల్జియం

Mehul Choksi: మెహుల్‌ ఛోక్సీ తమ  దేశంలోనే ఉన్నాడన్న బెల్జియం
X
పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,500 కోట్ల మేర రుణాలు తీసుకున్న మెహుల్ చోక్సీ

పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచి.. విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలోనే ఉన్నట్టు ఆ దేశం తాజాగా ధ్రువీకరించింది. చోక్సీ తమ దేశంలోనే ఉన్నాడని, ఆయన మీద నమోదైన కేసు ప్రాధాన్యత కూడా తమకు తెలుసనని బెల్జియం విదేశాంగ శాఖ వెల్లడించింది. దీనిపై తాము దృష్టిసారించామని, అయితే చోక్సీపై నమోదైన వ్యక్తిగత కేసుల గురించి తాము వ్యాఖ్యానించబోమని తెలిపింది. కానీ, ఈ కేసులో ముఖ్యమైన పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్టు ఈ మేరకు బెల్జియం విదేశాంగ శాఖ ఓ ప్రకటన వెలువరించింది. కాగా, చోక్సీని అప్పగించాలని భారత అధికారులు ఇప్పటికే బెల్జియం ప్రభుత్వాన్ని సంప్రదించినట్టు ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ అసోసియేటెడ్ ప్రెస్ కథనం నివేదించింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.13,500 కోట్ల రుణం తీసుకుని.. భారీ కుంభకోణానికి పాల్పడిన మెహుల్ చోక్సీ.. దేశం విడిచిపారిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో నిందితుడు, చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీని లండన్ నుంచి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. పీఎన్‌బీ కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన చోక్సీ.. బెల్జియం పౌరురాలైన తన భార్య ప్రీతీతో కలిసి ఆంట్వెర్ఫ్‌లో ఉంటున్నాడని, అక్కడ ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందాడని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.

వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా అండ్ బార్బుడా నుంచి బెల్జియానికి మకాం మార్చిన చోక్సీకి ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది. ఇటీవల రైసీనా చర్చల్లో పాల్గొనడానికి భారత్‌కు బార్బుడా విదేశాంగ శాఖ మంత్రి ఈపీ చెట్.. చోక్సీ గురించి వెల్లడించారు. ప్రస్తుతం మెహుల్ చోక్సీ తమ దేశంలో లేడని.. ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని పేర్కొన్నాడు. కాగా, 2018 జనవరిలో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడటానికి కొద్ది వారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు దేశం దాటిపోయారు. కుంభకోణం బయటపడటానికి రెండు నెలల ముందే అతడు అంటిగ్వా పౌరసత్వం పొందినట్టు తెలిసింది.

Tags

Next Story