అంతర్జాతీయం

H1B వీసాదారుల జీవిత భాగస్వాములకు భారీ ఊరట

బైడెన్‌ ఈ కీలక నిర్ణయంతో భారతీయ వలసదారులకు అధిక ప్రయోజనం కలగనుంది.

H1B వీసాదారుల జీవిత భాగస్వాములకు భారీ ఊరట
X

హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారీ ఊరట కల్పించారు. హెచ్‌4 వీసాదారుల పని అనుమతులు రద్దు చేసేలా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొచ్చిన నూతన వలస విధానాన్ని బైడెన్‌ సర్కార్‌ వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సరిగ్గా వారం రోజుల తర్వాత బైడెన్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. తాజా నిర్ణయంతో భారతీయ వలసదారులకు అధిక ప్రయోజనం కలగనుంది.

హెచ్-‌1బీ వీసాదారుల జీవిత భాగస్వాములతో పాటు 21ఏళ్ల లోపు పిల్లలకు.. అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ-USCIS హెచ్‌4 వీసాలు జారీ చేస్తుంటుంది. అయితే తొలుత హెచ్‌4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుండేది కాదు. దీంతో హెచ్‌-1బీ వీసాదారులపై ఆర్థికభారం అధికంగా ఉండేది. ఈ నేపథ్యంలో హెచ్‌4 వీసాదారులు చట్టపరంగా అమెరికాలో ఉద్యోగం చేసుకునేలా పని అనుమతి కల్పిస్తూ 2015లో అప్పటి ఒబామా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి రాగానే.. వలస విధానంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. హెచ్‌4 వీసాదారులకు పని అనుమతులు రద్దు చేయనున్నట్లు యూఎస్‌ కోర్టుకు తెలిపారు.

హెచ్‌1బీ వీసాదారుల భాగస్వాముల్లో చాలా మంది నిపుణులైన భారతీయ మహిళలే ఉన్నారు. ట్రంప్‌ సర్కార్‌ తీసుకొచ్చిన నిబంధనల కారణంగా పలువురి భవితవ్యం అయోమయంలో పడింది. ఈ క్రమంలో వారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ అమెరికా చట్టసభ్యులు గతేడాది డిసెంబరులో బైడెన్‌ను కలిశారు. హెచ్‌4 వీసాలతో అమెరికాలో పనిచేస్తున్న ఎంతోమంది విదేశీ మహిళలు.. వైద్యంతో పాటు అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చట్టసభ్యులు తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వారి అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. హెచ్‌4 వీసాలపై ట్రంప్‌ విధానాలను వెనక్కి తీసుకోవాలని కోరారు.

Next Story

RELATED STORIES