Tuna Fish: ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు..ఎందుకంత ప్రత్యేకమంటే..

సముద్రాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయాల్లో అప్పుడప్పుడు కొన్ని అరుదైన చేపలు వలలో చిక్కుతూ ఉంటాయి. భారీ బరువు కలిగిన చేపలుసైతం మత్స్యకారుల వలలకు చిక్కుతుండటం మనం చూస్తుంటాం. అలాంటి వాటికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే, కొన్ని అరుదైన జాతులకు చెందిన చేపలు చిక్కినప్పుడు లక్షల్లో చెల్లించి వాటిని కొనుగోలు చేస్తుంటారు. జపాన్ (Japan) లోనూ ఓ అరుదైన జాతికి చెందిన భారీ పరిమాణం కలిగిన చేప మత్స్యకారుల వలకు చిక్కింది. దానిని కొనుగోలు చేసేందుకు స్థానికులు పోటీ పోడ్డారు. చివరకు రెస్టారెంట్లు కలిగిన సంస్థ ఆ చేపను రూ.11కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నూతన సంవత్సరం వేళ జపాన్ లో మత్స్యకారుల వలకు అరుదైన జాతికి చెందిన చేప చిక్కింది. టోక్యో (Tokyo) చేపల మార్కెట్లో విక్రయానికి పెట్టారు. దానిని బ్లూఫిన్ ట్యూనా చేప (Tuna Fish) అంటారు. దాని బరువు 276కిలోలు ఉంది. ఈ ట్యూనా చేపను ఒండెరా సంస్థకు చెందిన సుషీ రెస్టారెంట్ నిర్వాహకులు సుమారు రూ. 11 కోట్లు( 1.3 మిలియన్ డాలర్లు) చెల్లించి సొంతం చేసుకున్నారు. అయితే, భారీ ధరతో ఆ చేపను కొనుగోలు చేయడానికి ప్రత్యేక కారణం ఉందట. కొత్త ఏడాదిలో వచ్చే తొలి ట్యూనా చేప అదృష్టాన్ని తీసుకొస్తుందని జపనీయుల నమ్మకం. దీంతో నూతన సంవత్సరం వేళ భారీ ట్యూనా చేపను అధిక ధరను చెల్లించి దక్కించుకున్నారు.ట్యూనా చేపది (రూ.11కోట్లు) రెండో అత్యధిక ధర
టోక్యా చేపల మార్కెట్ లో 1999 సంవత్సరం నుంచి అత్యధిక ధరకు అమ్ముడుపోయిన చేపల రికార్డులను పరిశీలిస్తే.. ప్రస్తుతం ట్యూనా చేపది (రూ.11కోట్లు) రెండో అత్యధిక ధర. అంతకుముందు 2019లో నిర్వహించిన వేలంలో 278కిలోల బరువు కలిగిన ట్యూనా చేప ఏకంగా రూ. 18కోట్లు పలికింది. గతేడాది (2024 సంవత్సరం ప్రారంభంలో) ట్యూనా చేప కోసం 114 మిలియన్ యెన్ లను చెల్లించామని ఒనోడెరా గ్రూప్ పేర్కొంది.
నూతన సంవత్సరంలో తొలి ట్యూనా చేపను దక్కించుకుంటే అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని మా నమ్మకం అని ఒండెరా సంస్థకు చెందిన ఉద్యోగి తెలిపాడు. మా రెస్టారెంట్ ద్వారా ప్రజలు దీనిని తిని అద్భుతమైన సంవత్సరంగా 2025ను గడపాలని మా కోరిక అంటూ పేర్కొన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com