Oxfam report: ట్రంప్ విధానాలతో సంపన్నులకు పండగ.. ఆక్స్‌ఫామ్ సంచలన నివేదిక

Oxfam report: ట్రంప్ విధానాలతో సంపన్నులకు పండగ.. ఆక్స్‌ఫామ్ సంచలన నివేదిక
X
12 మంది వద్ద 400 కోట్ల మంది సంపద..

ప్రపంచంలోని అపర కుబేరుల సంపద 2025లో రికార్డు స్థాయికి చేరిందని, ఇది అత్యంత ప్రమాదకరమైన రాజకీయ పరిణామాలకు దారితీస్తుందని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ హెచ్చరించింది. దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సు ప్రారంభానికి ముందు విడుదల చేసిన తన వార్షిక నివేదికలో ఈ సంచలన విషయాలను వెల్లడించింది.

ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం ప్రపంచ కుబేరుల మొత్తం సంపద 18.3 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే వీరి సంపద 16.2 శాతం పెరిగింది. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిబంధనల సరళీకరణ, కార్పొరేట్ పన్నుల తగ్గింపు వంటి విధానాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులకు భారీగా లబ్ధి చేకూర్చాయని ఆక్స్‌ఫామ్ విశ్లేషించింది. చరిత్రలో మొదటిసారిగా ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య 3,000 దాటిందని పేర్కొంది.

ఆర్థిక అసమానతల తీవ్రతను వివరిస్తూ, ప్రపంచంలోని టాప్ 12 మంది బిలియనీర్ల (టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సహా) వద్ద ఉన్న సంపద, ప్రపంచంలోని అత్యంత పేద సగం జనాభా (సుమారు 400 కోట్ల మంది) మొత్తం సంపద కంటే ఎక్కువని నివేదిక స్పష్టం చేసింది. ఈ సంపదను ఉపయోగించి కుబేరులు రాజకీయ శక్తిని కొనుగోలు చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అని ఆక్స్‌ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ అన్నారు. ఎలాన్ మస్క్ 'ఎక్స్‌'ను, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 'వాషింగ్టన్ పోస్ట్' వంటి మీడియా సంస్థలను కొనుగోలు చేయడాన్ని ఉదాహరణలుగా చూపారు.

ఈ నేపథ్యంలో ట్రంప్ దావోస్ సదస్సుకు హాజరుకావడాన్ని నిరసిస్తూ దాదాపు 300 మంది ఆందోళన చేపట్టారు. వారిలో కొందరు ఎలాన్ మస్క్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాస్కులు ధరించి నిరసన తెలిపారు. ఎలాంటి ప్రజాస్వామ్య విధానాలు లేకుండా ప్రపంచాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారని, ట్రంప్ వంటి వారిని సదస్సుకు ఆహ్వానించడం ఆమోదయోగ్యం కాదని నిరసనకారులు ఆరోపించారు.

అంతర్జాతీయంగా అంగీకరించిన 15 శాతం కనీస కార్పొరేట్ పన్ను నుంచి అమెరికా బహుళజాతి సంస్థలకు మినహాయింపు ఇవ్వడం, పెరుగుతున్న అసమానతలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనడానికి నిదర్శనమని ఆక్స్‌ఫామ్ విమర్శించింది. అపర కుబేరులు తమ సంపదతో రాజకీయాలను శాసిస్తూ, సామాన్యుల హక్కులను, స్వేచ్ఛను హరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

Tags

Next Story