Bitcoin: బిట్కాయిన్ల విలువ లక్ష డాలర్లు, బిట్‌కాయిన్ రికార్డు

బిట్‌కాయిన్ కొత్త రికార్డు సృష్టించింది. ఆ క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ లక్ష డాలర్లకు చేరుకున్నది. అమెరికా కాబోయే అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత బెట్‌కాయిన్ మార్కెట్ జోరందుకున్నది. ఈ ఏడాది దాని విలువ రెండింతలు అయ్యింది. గడిచిన నాలుగు వారాల్లో ఆ కరెన్సీ విలువ 45 శాతం పెరిగింది. అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ నేతల్లో క్రిప్టో కరెన్సీ అనుకూల వ్యక్తులు కూడా ఉండడం గమనార్హం.
ట్రంప్ సర్కారు క్రిప్టోకరెన్సీలకు స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆశిస్తున్నారు. ప్రధాన ఆర్థిక వనరుగా బిట్‌కాయిన్ మారబోతున్నట్లు అమెరికాకు చెందిన గెలాక్సీ డిజిటల్ సంస్థ సీఈవో మైక్ నోవోగ్రాజ్ తెలిపారు. టొకెన్లు ఇవ్వడం, పేమెంట్స్ కోసం బిట్‌కాయిన్‌ను వాడే పరిస్థితులు పెరగనున్నాయి.
బిట్‌కాయిన్‌ను సృష్టించిన 16 ఏళ్ల తర్వాత.. ప్రధాన కరెన్సీగా చెలామణిలోకి రాబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. బిట్‌కాయిన్ విలువ లక్ష డాటర్లు దాటడం మైలురాయి అని, ఫైనాన్స్.. టెక్నాలజీ రంగంలో పెను మార్పు రానున్నట్లు హాంగ్‌కాంగ్ క్రిప్టో విశ్లేషకుడు జస్టిస్ డీఆంథెనా తెలిపారు.రాబోయే పదేళ్లలో బిట్‌కాయిన్ విలువ పది కోట్ల వరకు చేరే అవకాశాలు ఉన్నట్లు కూడా క్రిప్టో నిపుణులు అంచనా వేస్తున్నారు.
2009లో చలామణిలోకి వచ్చిన బిట్‌కాయిన్ ధర అప్పుడు జీరోగా ఉంది. 2011 ఫిబ్రవరిలో ఒక డాలరు మార్క్‌ను దాటింది. అలా 2020 నాటికి దీని విలువ 5000 డాలర్లకు చేరుకుంది. 2024లో ఫిబ్రవరిలో 57 వేల డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్ అమెరికా ఎన్నికల రోజున 69,374 డాలర్లుగా ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత 90 వేల మార్క్‌కు చేరింది. నవంబర్ 21న బిట్‌కాయిన్ విలువ 95 వేల డాలర్లకు పెరిగిన బిట్‌కాయిన్ విలువ తాజాగా లక్ష డాలర్ల మార్క్‌ను దాటింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com