America Snowfall: మంచు తుఫాను బీభత్సం.. కదలికలు లేని నయాగర

America Snowfall: అమెరికాలో కురుస్తున్న మంచు తుఫానుతో జనజీవనం స్తంభించి పోయింది. రోడ్లు, ఇల్లు, పరిసరప్రాంతాలన్నీ మంచుతో నిండిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు విలవిలలాడుతన్నారు. మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తీవ్ర స్నోఫాల్‌తో, శీతల గాలులతో అమెరికా గజగజలాడిపోతోంది. మైనస్ టెంపరేచర్‌తో ప్రఖ్యాత నయాగరా వాటర్‌ఫాల్స్ కూడా గడ్డకట్టుకుపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఎప్పుడూ ఉధృతంగా ప్రవహించే నయాగరా ఎటువంటి కదలికలు లేకుండా పూర్తిగా స్తంభించింది.
ఇక ఈ శతాబ్దంలోకెల్లా అత్యంత తీవ్రమైన మంచు తుఫాన్ కోరల నుంచి అమెరికా ఇంకా బయట పడలేదు. రోడ్లపై పేరుకున్న మంచును తొలగించడంతో పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మంచులో కూరుకుపోయిన కార్లలో నిస్సహాయంగా మరణించిన వారి శవాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. మంచు తుఫాన్ ధాటికి దాదాపు 100 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం.
మరోవైపు రవాణా వ్యవస్థ స్తంభించడంతో అమెరికాలో చాలా ప్రాంతాల్లో నిత్యావసరాల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో చాలా రాష్ట్రాల్లో ఆకలి కేకలు విన్పిస్తున్నాయి. బయటికెళ్లే పరిస్థితి లేక జనం రోజుల తరబడి ఇళ్లకే పరిమితం అవుతున్నారు..నాలుగైదు రోజులుగా షాపులు తెరిచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. మొన్నటిదాకా బఫెలో సిటీలోనే జరిగిన లూటీలు ఇప్పుడు పలు రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాల కోసం దుకాణాల్లోకి చొరబడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న లక్షలాది మంది తెలుగువాళ్లు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇక వెస్ట్ న్యూయార్క్‌లోని బఫెలో సిటీలో ఇంకా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. చాలాచోట్ల ఇంకా 8 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. దీంతో సహాయక చర్యలకు కూడా అంతరాయం కలుగుతుంది. సిటీలో రోడ్డు ప్రయాణాలపై నిషేధం ఇంకా అమల్లోనే ఉంది. పక్కనే ఉన్న న్యూజెర్సీ నుంచి ఎమర్జెన్సీ రెస్క్యూ టీం న్యూయార్క్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ 30కి పైగా మృతదేహలను వెలికితీశారు. సహాయక చర్యల్లో భాగంగా సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com